బీజేపీ నేత ఇంట్లో కోట్లల్లో పాత కరెన్సీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా ఆ ఇంట్లో కట్టలుకట్టలుగా పాత కరెన్సీ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45 కోట్ల నోట్లు. సాక్షాత్తు బీజేపీ నేత ఇంటి నుంచి గురువారం ఈ భారీ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీజేపీకి చెందిన ప్రముఖ నేత దండపాణి చెన్నై కోడంబాక్కం జక్రియాకాలనీ 2వ వీ«ధిలో నివసిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు.
ఇతని సోదరులు పోలీస్‌శాఖలో పనిచేస్తూ సినిమా రంగంలో ఉండేవారికి దుస్తులు కుట్టించే రామలింగ్ అండ్ కో అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. వీరికి ఇదే కాలనీలో పదికి పైగా ఇళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దండపాణి తన బంధుమిత్రులతో కలిసి అవసరమైన వారికి రూ.500, రూ.1000ల చెల్లనినోట్లనుకొత్త నోట్లు మార్చి ఇచ్చే వ్యవహారం నడుపుతున్నట్లు కోడంబాక్కం పోలీసులకు రహస్య సమాచారం అందింది.
దీంతో సీఐ చిట్టిబాబు నేతృత్వంలో దండపాణి ఇంటిపై నిఘా పెట్టారు. ఈ దశలో బుధవారం సాయంత్రం వీరింటికి కొందరు అనుమానాస్పద వ్యక్తులు రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించి గురువారం తెల్ల వారుజామున ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పది పెట్టెల్లో దాచి ఉంచిన రూ.45 కోట్ల విలువైన రూ.500, రూ.1000ల చెల్లని నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్లను స్వాధీనం చేసుకుని దండపాణిని పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు కమీషన్ పై పాత నోట్లను మార్చి ఇచ్చేలా లావాదేవీలు నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా పాతనోట్లు మార్చినందుకు 50 శాతం కమీషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుసుకుని పోలీసులు నోరు వెళ్లబెట్టారు. భారీ ఎత్తున పాతనోట్లు పట్టుబడిన విషయాన్ని ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నగరంలో జ్యువెలరీ షాపు నడిపే ఒక పారిశ్రామిక వేత్తను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తరువాత చెన్నైలో ఒకే ఇంట్లో రూ.45 కోట్లు పట్టుబడడం కలకలానికి దారితీసింది. కమీషన్ చెల్లించి పాత నోట్ల మార్పిడిని కోరిన వారెవరు. ఇందుకు సహకరించేవారు ఎవరు, దండపాణి పరిధిలో ఇంకా ఎంతమంది వద్ద పాత నోట్లు ఉన్నాయి అని పోలీసులు విచారిస్తున్నారు.