ఒంగోలులోని నయీమ్ ఇంట్లో సిట్ సోదాలు
* ‘డెవిల్ హౌస్’ తాళాలు పగలగొట్టి లోపలకి ప్రవేశించిన సిట్ బృందం
* ఏమీ దొరకకపోవడంతో వెనుతిరిగిన వైనం
ఒంగోలు క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ న యీమ్ ఇంట్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (సిట్) అధికారులు సోదాలు నిర్వహించారు. ఒంగోలులోని ముంగమూరు రోడ్డులో ఉన్న సురక్ష అపార్ట్‌మెంట్‌లో నయీమ్‌కు 510 నంబరుతో ప్లాటు ఉంది. దీనికి అతను ‘డెవిల్ హౌస్’ అని పేరు పెట్టుకున్నాడు. ఇందులో నయీమ్ ముఖ్య అనుచరుడు సలీం అలియాస్ ఫయూం ఉండేవాడు. నయీమ్ కేసులో ఫయూం రెండో నిందితుడు. ఈ ప్లాటులో సోదాలు చేసేందుకు సీఐ బిక్షపతితో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్ల బృందం శుక్రవారం హైదరాబాద్ నుంచి ఒంగోలు చేరుకుంది.
తొలుత వారు ప్లాటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాలని భావించారు. అందుకు అపార్ట్‌మెంటు కమిటీ సభ్యులు నిరాకరించడంతో వెనుదిరిగారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ అనుమతి తీసుకుని ఒంగోలు ఎస్సై సురేష్‌తో కలసి సిట్ అధికారులు మళ్లీ ప్లాటు వద్దకు వచ్చారు. నయీమ్ ఇంట్లో వంట మనిషిని వెంటబెట్టుకొని తాళా లు పగులగొట్టి ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ ఇంటికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెం టు, నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొన్ని నకళ్లు, విద్యుత్ బిల్లులు, అపార్ట్‌మెంటు కరెంటు బిల్లులు మాత్రమే లభ్యమయ్యాయని సమాచారం. లోపల భారీ మొత్తంలో నగదు, డాక్యుమెంట్లు, మారణాయుధాలు ఉంటాయని సిట్ అధికారులు భావించారు. ఏమి దొరకక వెనుతిరిగి వెళ్లిపోయారు. ఏమేమి దొరికాయని సిట్ పోలీసులను అడిగినా వారు వెల్లడించేందుకు నిరాకరించారు.
చర్లపల్లి జైలుకు ఫయీమ్
హైదరాబాద్: రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో నిందితులుగా ఉన్న ఫయీమ్, అతడి భార్య షాహీమ్‌లను నార్సింగి పోలీసులు శుక్రవారం సాయంత్రం ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హజరుపరిచారు. ఇరువురిని న్యాయమూర్తి ఆదేశం మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు.