బరితెగింపు!
విద్యార్థినిపై హాస్టల్‌లో కాల్పులు
చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
గాయపడిన మరో విద్యార్థిని ఆస్పత్రిలో పోలీసుల అదుపులో నిందితుడు
కృష్ణరాజపురం/బనశంకరి/పావగడ : ఉద్యాననగరిలో ఉన్మాది బరితెగించాడు. హాస్టల్‌లో నిద్రిస్తున్న ఓ విద్యార్థినిపై కాల్పులు జరిపాడు. మరో విద్యార్థిని కొనవూపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి... తుమకూరు జిల్లా పావగడ తాలూకా పతంజలి నగర్‌కు చెందిన రమేష్, లక్ష్మి దంపతుల కుమార్తె గౌతమి(17), డాక్టర్ జయంతి, శ్రీనాథ్‌ల కుమార్తె శిరీష బెంగళూరులోని కాడుగోడి ఉన్న ప్రగతి కళాశాల హాస్టల్‌లో ఉంటూ రెండో ఏడాది పీయూసీ చదువుకుంటున్నారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్‌స ముగిసిన తర్వాత గౌతమి, శిరీషా మూడవ అంతస్తులోని తమ గదికి చేరుకున్నారు. రాత్రి 10.05 గంటలకు గౌతమి గది తలుపు తట్టిన చప్పుడు కావడంతో శిరీషా తలుపు తీసింది. ఆ సమయంలో అదే కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న మహేష్(28) లోపలకు దూసుకువచ్చి శిరీషాను పక్కకు నెట్టి తన వద్ద ఉన్న తపంచా(నాటు తుపాకీ)తో నిద్రిస్తున్న గౌతమిపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతన్ని పట్టుకునేందుకు శిరీషా ప్రయత్నించడంతో ఆమెపై కూడా అతను కాల్పులు జరిపి పారిపోయాడు.
మిన్నంటిన హాహాకారాలు
అర్ధరాత్రి హాస్టల్‌లో తుపాకీ కాల్పుల శబ్ధంతో విద్యార్థులు హడలిపోయారు. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు అప్రమత్తమై హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కళాశాల సిబ్బంది క్షతగాత్రులను తీసుకుని కిందకు చేరుకుంది. వెంటనే వారిని స్థానిక వైదేహి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గౌతమి మరణించింది. ప్రాథమిక చికిత్స అనంతరం శిరీషాను మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న బాధిత కుటుంబసభ్యులు తెల్లవారుజాము మూడు గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకోగానే కుమార్తె మరణించిందన్న విషయం తెలుసుకుని గౌతమి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. బంధువులు, సహ విద్యార్థుల రోదనలతో ఆస్పత్రి నిండిపోయింది. ఇదిలా ఉండగా హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, నగరపోలీస్‌కమిషనర్ ఎం.ఎన్.రెడ్డితో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు.
పోలీసుల అదుపులో నిందితుడు
కాల్పులు జరిపిన అనంతరం మహేశ్ బెంగళూరులోని ఏ.నారాయణపురలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో మహేశ్ ఫొటో టీవీల్లో రావడం గమనించిన ఆ ఇంటి ఓనర్ పోలీసులకు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఫోన్ చేసి మహేశ్ ఆచూకీ తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మహేశ్‌ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కళాశాల ప్రతినిధి ప్రశాంత్ మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థునులకు రక్షణ కల్పించలేక పోయిన కళాశాల లెసైన్సును రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శిరీష తల్లి జయంతి వాదన మరోలా ఉంది. గౌతమి, శిరీష వేర్వేరు గదుల్లో ఉండగా మొదట గౌతమిపై కాల్పులు జరిగాయని, అటుపై పక్క గదిలో ఉన్న శిరీష పై కాల్పులు జరపడంతో శిరీష గాయపడినట్లు మీడియాతో పేర్కొన్నారు.
తపంచా ఎలా వచ్చింది...
నిందితుడి చేతికి తపంచా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో విద్యార్థునులు ఉంటున్న హాస్టల్‌లోకి ఎలా చేరారనే విషయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉండగా నిందుతుడు మహేశ్...కళాశాల విద్యార్థునులు బయటి వారితో ఎవరితోనూ మాట్లాడకూడదని తరుచుగా బెదిరించేవాడని తెలుస్తోంది. దీంతో విద్యార్థునులు ఇతన్ని వివిధ నిక్‌నేమ్‌లతో గేలిచేసేవారని ఈ విషయంలో మనస్థాపం చెందిన మహేశ్ ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది.