అధికారంలోకి రావడమే లక్ష్యం కాంగ్రెస్‌పై విద్యుత్ బాణం
Published Sat, Nov 16 2013 11:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇటు బీజేపీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. విద్యుత్ టారిఫ్ పెంపే ప్రధానాంశంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి. రెండు సంవత్సరాల వ్యవధిలో నగరంలో 65 శాతం మేర టారిఫ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఈ ఎన్నికలపై పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ అంశంపై కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న బీజేపీ తాము అధికారంలోకి వస్తే 30 శాతం, 50 శాతం తగ్గిస్తామని ఆప్‌లు హామీల వర్షం కురిపిస్తున్నాయి. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరగడం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ఇది తమ నెలసరి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని అటు పేదవారితోపాటు ఇటు ధనిక కుటుంబాలు సైతం వాపోతున్నాయి.
విద్యుత్ సరఫరా మెరుగుపడినప్పటికీ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడం అందరినీ ఆవేదనకు లోనుచేస్తోంది. 2011లో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్‌సీ) 22 శాతం మేర విద్యుత్ చార్జీలను పెంచింది. ఆ తరువాత 2012 ఫిబ్రవరిలో ఐదు శాతం పెంచింది. మరలా మే నెలలో రెండు శాతం, జూలైలో 26 శాతం పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు, జూలైలో ఐదు శాతం పెంచింది. దీంతో మేలుకున్న ప్రభుత్వం 400 యూనిట్లలోపు వినియోగించుకునేవారికి సబ్సిడీ ప్రకటించింది. ఈ విషయమై జనక్‌పురి ప్రాంతంలో నివసించే దినేశ్‌కుమార్ మాట్లాడుతూ ఓటింగ్ సమయంలో సమాజంలోని అన్నివర్గాలు ఈ అంశాన్ని మదిలో పెట్టుకోవడం తథ్యమన్నారు.
విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడమనేది సామాన్యుడి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు. పిల్లల చదువుకోసం డబ్బు దాచుకోవడం అత్యంత కష్టంగా మారిపోయిందన్నారు. ఈ వాదనను జంగ్‌పుర ప్రాంతంలో నివసిస్తున్న బ్యాంకు ఉద్యోగి రాకేశ్ గుప్తా సమర్థించాడు. ‘విద్యుత్ చార్జీలు అనేక రెట్ల మేర పెరిగాయి. ఇక కూరగాయలతోపాటు నిత్యావసర సరుకుల ధరల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు’ అని అన్నాడు. ఇదిలాఉంచితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలతో చేతులు కలిపిందని ఆరోపిస్తూ 25 శాతం మేర చార్జీలను తగ్గించాల్సిందిగా ఎందుకు కోరడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అప్పట్లో బీజేపీ విరామం లేకుండా విమర్శనాస్త్రాలు సంధించింది. దీంతో ఇరకాటంలో పడిపోయిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంచొద్దంటూ 2010, మే నాలుగో తేదీన డీఈఆర్‌సీని ఆదేశించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయాలంటూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు ఒత్తిడి చేసినా రాష్ట్రప్రభుత్వం అందుకు నిరాకరించింది. 2010-11 కాలానికి కొత్త టారిఫ్‌ను సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా డీఈఆర్‌సీ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు సన్నద్ధత వ్యక్తం చేసింది.
సొంత ఇళ్లులేని వారి పరిస్థితి మరీ ఘోరం
నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. యజమానులు ఒక్కొక్కసారి వారి వద్ద నుంచి అసాధారణ రీతిలో బిల్లులు వసూలు చేస్తుండడమే ఇందుకు కారణం. ఈ విషయమై సాకేత్ ప్రాంతంలోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బన్సీలాల్ మాట్లాడుతూ తన నివాసంలోని ప్రతి ఇంటికీ ఆయా యజమానులు వ్యక్తిగత మీటర్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కారణంగా కిరాయిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
చార్జీలు అనుకూలంగా లేవు: విజయ్ గోయల్
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నగరంలో విద్యుత్ చార్జీలు సామాన్యుడికి ఎంతమాత్రం అనుగుణంగాలేవని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతోమాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పేదలు భరించేవిధంగా చార్జీలు ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ రంగంలో సంస్కరణలు తెస్తామన్నారు. చార్జీల పెంపు ఎంతమాత్రం సరికాదన్నారు. మధ్య, దిగువతరగతి ప్రజలపై అసాధారణ రీతిలో రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతోందన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో బిజిలీ ర్యాలీలు
విద్యుత్ టారిఫ్ పెంపు అనంతర పరిణామాలను తనకు అనుగుణంగా మార్చుకునేందుకు, ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేసింది. ఈ ఏడాది ఆగస్టులో బిజిలీ ర్యాలీలు నిర్వహించింది. ఒకవేళ తదుపరి ఎన్నికల్లో తాము గెలిస్తే విద్యుత్ చార్జీల్లో 30 శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చింది.
‘ఆప్’దీ అదే దారి
అర వింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఊపిరిపోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం ఇదే దారిని ఎంచుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగరంలో అనేక ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. విద్యుత్ బిల్లులు చెల్లించొద్దంటూ నగరవాసులకు పిలుపునిచ్చింది. రచ్చబండ (గల్లీ-మొహల్లా) కార్యక్రమాలను చేపట్టిన ఆ పార్టీ విద్యుత్ టారిఫ్‌ను 23 శాతం తగ్గించాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
కాగా 2002లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టింది. వివిధ వర్గాలు ఇందుకు అభ్యంతరం చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. సంస్కరణల అనంతరం విద్యుత్ పంపిణీ బాధ్యతలను బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్, రాజధాని పవర్ లిమిటెడ్, నార్త్ ఢిల్లీ పవర్ లిమిటెడ్ సంస్థలకు అప్పగించింది. ఈ మూడు సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది.
Advertisement