చెన్నై విమానాశ్రయంలో తుపాకీ, బుల్లెట్‌తో వచ్చిన ప్రయాణికుని పోలీసులు అరెస్టు చేశారు.
టీనగర్: చెన్నై విమానాశ్రయంలో తుపాకీ, బుల్లెట్‌తో వచ్చిన ప్రయాణికుని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాంబోడియాకు వెళ్లేందుకు గురువారం రాత్రి బయలుదేరేందుకు ఒక విమానం సిద్ధంగా ఉంది. అందులో ప్రయాణించేందుకు వచ్చిన వారి సామగ్రిని అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఒక ప్రయాణికుని వద్ద పేలని తపాకీ బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారు.
విచారణలో అతడు కాంబోడియాకు చెందిన ఇన్‌సెల్కం (45) అని, కొన్ని రోజుల క్రితం చెన్నై, ఆళ్వారుపేటలోగల బధిరుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి తన బృందం సహా వచ్చినట్లు తెలిసింది. దీని గురించి ఇన్‌సెల్కం ఈ బుల్లెట్ కాంబోడియాలో తనకు లభించిందని, అనేక ఏళ్లుగా ఇది తన బ్యాగులో ఉందని తెలిపాడు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అధికారులు అతన్ని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. వారు ఇన్‌సెల్కంను అరెస్టు చేశారు.