పెండింగ్ అంశాలు 2 వారాల్లో పరిష్కరిస్తాం
• కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హామీ
• వివరాలు వెల్లడించిన వెంకయ్య, సుజనా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలను రెండు వారాల్లోపు పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలి పారు. మంగళవారం రాజ్‌నాథ్‌తో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, వెంకయ్య సమావేశమయ్యారు. విభజన చట్టం హామీల అమలుపై చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెంకయ్య వెల్లడించారు. విభజన చట్టంలోని కొన్ని అంశాల అమలు పెండింగ్‌లో ఉందని, దీనిని సత్వరం పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు.
ఈ సందర్భంగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని రాజ్‌నాథ్ పిలిపించి పెండింగ్ అంశాలపై కూలంకషంగా చ ర్చించి నట్లు చెప్పారు. ఏ వివాదాలూ లేని అంశాలు, రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన వాటి విషయంలో చొరవ తీసుకొని, పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శిని రాజ్‌నాథ్ ఆదేశించారన్నారు. రెండు వారాల్లోపు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు, ఏపీకి ఇవ్వాల్సిన సంస్థల కేటాయింపునకు హోం మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండి సంబంధిత శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారానికి ఆదేశించాలని కోరామన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చిస్తున్నట్లు చెప్పారు.
సీట్ల పెంపుపై ఏజీ అభిప్రాయాన్ని అధ్యయనం చేస్తామన్నారు
అసెంబ్లీ సీట్లు పెంపుపైనా సమావేశంలో రాజ్‌నాథ్‌తో చర్చించినట్లు వెంకయ్య తెలిపారు. ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుందామని హోం మంత్రి చెప్పారన్నారు. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమై నెలలోపు ఏపీలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే, ఈ నెల 19న మెడిటెక్ పార్క్ ప్రారంభించాలని కోరగా, సూత్రపాయంగా అంగీకరించారని తెలిపారు.