కొత్త జిల్లాల నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిల్
Published Sat, Sep 10 2016 7:13 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం గత నెల 22న జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఏజెన్సీ ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో కొన్ని మండలాలతో కొత్త జిల్లాల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ ముగిసేంత వరకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.
ఇందులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా పునర్విభజన కమిటీ చైర్మన్, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సలహా మండలి చైర్మన్, గవర్నర్ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండవని, గవర్నర్‌కు మాత్రమే అధికారాలు ఉంటాయని శ్రీనివాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాలను ఆ జిల్లా నుంచి విడదీసి కొత్తగా ఏర్పాటు చేయదలచిన మహబూబాబాద్‌లో కలపనున్నారు. అలాగే వరంగల్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ మండలాలను కూడా మహబూబాబాద్‌లో కలపనున్నారు.
వరంగల్ జిల్లాలోని ములుగు, గోవిందరావుపేట్, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలో చేర్చనున్నారు. అదే విధంగా అదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే కొమరం భీం జిల్లాలో చేర్చనున్నారు. రాజ్యాంగం ప్రకారం ఈ షెడ్యూల్ ప్రాంతాలపై పూర్తి అధికారాలు గవర్నర్‌వే. ఈ ప్రాంతాల్లో చేయబోయే ప్రతీ పనిని గిరిజన సలహా మండలిని సంప్రదించిన తరువాతే చేయాలి. కానీ, ఇక్కడ ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ జారీ చేసేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం.’ అని శ్రీనివాస్ తన వ్యాజ్యంలో వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు
Advertisement
Advertisement