గత రెండు రోజులుగా అన్నాడీఎంకే చుట్టూ తిరిగిన రాజకీయ నేతల దృష్టి ఇక రాజ భవన్‌పై మళ్లనున్నాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: గత రెండు రోజులుగా అన్నాడీఎంకే చుట్టూ తిరిగిన రాజకీయ నేతల దృష్టి ఇక రాజ భవన్‌పై మళ్లనున్నాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఎన్నికైన తరువాత ఇన్‌చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు గురువారం చెన్నైకి చేరుకోవడమే ఇందుకు కారణం.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఆ పార్టీ అల్లకల్లోంగా మారింది. ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంల మధ్య నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న పొరపొచ్చాలు అమ్మ సమాధి సాక్షిగా ఆదివారం బహిరంగమైనాయి. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుండి ఆదివారం వరకు తాను ఎదుర్కొన్న అవమానాలను పన్నీర్‌సెల్వం పూసగుచ్చినట్లు మీడియాకు వివరించారు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు శశికళ తన చేత బలవంతంగా రాజీనామా చేయించినట్లు పన్నీర్‌సెల్వం చేసిన ఆరోపణలు అన్నాడీఎంకేను కుదిపేశాయి.
డీఎంకే చేతిలో పన్నీర్‌సెల్వం పావుగా మారి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని శశికళ ప్రత్యారోపణలు చేయసాగారు. ఈనెల 5వ తేదీన శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. మద్రాసు యూనివర్సిటీలో ఏర్పాట్లు కూడా ప్రారంభమైనాయి. అయితే ఆ మరుసటి రోజే అంటే 6వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంచలన ప్రకటన చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై వారం రోజుల్లో తీర్పు చెప్పనున్నట్లు చెప్పడమే న్యాయమూర్తుల ప్రకటనలో సారాంశం. ఆస్తుల కేసులో ఏ–1 నిందితురాలైన జయలలిత మరణించగా ఏ–2 నిందితురాలిగా ఉన్న శశికళతోపాటూ ఏ–3, ఏ–4 నిందితులుగా ఆమె బంధువులైన ఇళవరసి, సుధాకరన్‌ల్లో ఆందోళన వ్యక్తమయింది.
దీనికి తోడు కేవలం 60 రోజుల్లోనే ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించడం, శాసనసభా పక్ష నేతగా శశికâ¶ ను ఎన్నుకోవడం, అసంతృప్తి ఇలా అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో ఊటీ నుండి చెన్నైకి రావాల్సిన గవర్నర్ కేంద్రం నుండి పిలుపు రావడంతో డిల్లీకి వెళ్లిపోయారు. తమిళనాడు రాజకీయాలపై న్యాయనిపుణులతో చర్చించి గవర్నర్ చెన్నైకి వస్తారని అన్నాడీఎంకే వర్గాలు ఆశించాయి. అయితే డిల్లీ నుండి గవర్నర్ ముంబయికి చేరుకున్నారు.
దీంతో గవర్నర్ ఇప్పట్లో చెన్నైకి వచ్చేనా, శాసనసభపక్ష నేతగా ఎన్నికైన శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించేనా, సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ దశలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి చేరుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా సమాచారం వచ్చింది. ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ తదితరులు గవర్నర్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.