ఇకపై చెప్పులు లేకుండా కోర్టుకు ఖైదీలు!
తిరువళ్లూరు: నిందితుడు న్యాయమూర్తిపై చెప్పులు విసిరిన ఘటన తమిళనాడు జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం న్యాయమూర్తి...ఇకపై కోర్టుకు ఖైదీలను హాజరుపరిచే సమయంలో చెప్పులు లేకుండా తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్లితే....తిరువళ్లూరు జిల్లా ఆవడి ప్రాంతానికి చెందిన ఏలుమలై(38)పై పలు కేసులు ఉన్నాయి. ఇతన్ని ఆరు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. పూందమల్లిలోని జ్యుడీషియల్ కోర్టు-1లో కేసు విచారణ కొనసాగుతోంది. మహిళా న్యాయమూర్తి నిషా కేసును విచారిస్తున్నారు. నిందితుడిని జనవరి 7న కోర్టుకు తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీసు బందోబస్తు నడుమ పుళల్ జైలు నుంచి ఏలుమలైను గురువారం కోర్టుకు తీసుకొచ్చారు.
ఈ కేసును న్యాయమూర్తి నిషా విచారణ చేస్తుండగానే ఆవేశానికి లోనైన అతను కోర్టులో వీరంగం సృష్టించాడు. ఎన్ని సార్లు కోర్టుల చుట్టూ తిరగాలంటూ ఏలుమలై గట్టిగా కేకలు వేశాడు. తీవ్ర దుర్భాషలాడిన అతడు చెప్పులు తీసుకుని మహిళా న్యాయమూర్తిపై విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితుడికి న్యాయమూర్తి మరో 15 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇకపై కోర్టుకు ఖైదీలను హాజరుపరిచే సమయంలో చెప్పులు లేకుండా తీసుకురావాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.