సాక్షి, ముంబై: మూడో విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలుచేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థుల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. ఈ నెల 24వ తేదీన 19 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం నామినేషన్ల దాఖలు పర్వం మార్చి 29వ తేదీ నుంచి ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం ఉత్తర ముంబై నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సంజయ్ నిరూపమ్, బీజేపీకి చెందిన గోపాల్ శెట్టి, వాయవ్య ముంబై నుంచి కాంగ్రెస్ తరఫున గురుదాస్ కామత్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సంజయ్ నిరూపమ్ రూ.53.93 లక్షలు చరాస్తులు, రూ.47.86 లక్షలు స్థిరాస్తులు ఉన్నాయని నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. భార్య పేరుపై రూ.59.4 లక్షలు చరాస్తులు, కూతురు, తల్లి పేరుపై రూ.34 లక్షల ఆస్తులు ఉన్నాయి.
వీటితోపాటు స్థలాలు ఇలా మొత్తం రూ. రెండు కోట్ల ఏడు లక్షల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. మహాకూటమి అభ్యర్థి గోపాల్ శెట్టి రూ. 93.84 లక్షలు చరాస్తులు, భార్య పేరుపై రూ.2.46 కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయని నామినేషన్‌లో పేర్కొన్నారు. తల్లి పేరుపై రూ.4.15 లక్షలు చరాస్తులు, రూ.11 లక్షలు విలువచేసే బంగారు నగలు, బదలాపూర్‌లో రూ.25 లక్షల విలువచేసే ఎకరన్నర భూమి ఉందని తెలిపారు. కాందివలిలో రూ.40 లక్షల విలువచేసే ఫ్లాటు, రూ.65 లక్షల విలువచేసే స్థిరాస్తులున్నాయని స్పష్టం చేశారు.
గురుదాస్ కామత్ తన పేరుపై రూ.ఆరు కోట్ల విలువచేసే చరాస్తులు, భార్య పేరుపై రూ.5.82 లక్షలు విలువచేసే ఆస్తులు, రూ.10 కోట్లు విలువచేసే బాండ్లు ఉన్నాయని నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. రూ.27 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.20 లక్షలు విలువచేసే భూములు, వర్లిలో రూ.మూడు కోట్ల విలువచేసే ఫ్లాటు ఉందని తెలిపారు. ఢిల్లీలో రూ.26 కోట్ల విలువచేసే ఫ్లాటు ఉందని తెలిపారు. వాయవ్య ముంబై నుంచి రాష్ట్రీయ్ ఆమ్ పార్టీ నుంచి పోటీచేస్తున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా తన మొత్తం ఆస్తులు రూ.15 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు.
ఎన్నికల బరిలో కోటీశ్వరులు
Published Wed, Apr 2 2014 11:24 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement