
ఆర్కే నగర్ లో బహుముఖ పోటీ!
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవడంతో అందరి దృష్టి ఈ ఉప ఎన్నికపై నిలిచింది. ‘అమ్మ’ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అన్నాడీఎంకే భావిస్తుండగా, ఇక్కడ పాగా వేసి సత్తా చాటాలని డీఎంకే వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా తమకు మద్దతు ఇవ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. వామపక్షాలను కోరారు. అన్నాడీఎంకే తరపున దినకరన్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.
ఇక ‘కెప్టెన్’ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే అభ్యర్థిగా ఆ పార్టీ ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును ఖారారైంది. విజయకాంత్ సతీమణి ప్రేమలతను పోటీ దింపాలని పలువురు నేతలు కోరుతున్నారు. పన్నీర్ సెల్వం శిబిరం నుంచి పోటీకి దిగనున్నట్టు మాజీ డీజీపీ తిలకవతి సూచనప్రాయంగా వెల్లడించారు.
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా సొంత పార్టీ తరపున బరిలోకి దిగుతానని ప్రకటించారు. ప్రజా సంక్షేమ వేదిక(పీడబ్ల్యూఎఫ్) కూడా పోటికి సిద్ధమవడంతో బహుముఖ పోరు తప్పదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది.
కాగా, ఆర్కే నగర్ లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి శశికళ వర్గం నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని దీప ఆరోపించారు.