సాక్షి, ముంబై/భివండీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక రాజకీయ పరిణామాలపై నాయకులతో చర్చించనున్నారు. తర్వాత ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోనున్నారు. అయితే ఆయన పర్యటన షెడ్యూల్ మాత్రం ఢిల్లీ నుంచి అధికారికంగా ఇంతవరకు వెల్లడి కాలేదు. అయితే ఔరంగాబాద్, ధుళే జిల్లాల అనంతరం ముంబైలో రాహుల్ పర్యటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.
పార్టీ నాయకుల వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ఆయన నేరుగా ఔరంగాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి శిర్పూర్ వెళతారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఔరంగాబాద్‌కు చేరుకుంటారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ధుళేకు చేరుకుంటారు. అక్కడ సభ కార్యక్రమం పూర్తిచేసుకుని ముంబైకి వస్తారు. గురువారం ఉదయం సహ్యాద్రి అతిథి గృహంలో విలేకరులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత శివారు ప్రాంతమైన వర్సోవా బీచ్‌లో కోళి (మత్స్యకారులు) సమాజం ప్రజలతో భేటీ అవుతారు. తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో భివండీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ పూర్తయిన తర్వాత సాయంత్రం మళ్లీ ఢిల్లీకి తిరుగి వెళతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
బహిరంగసభకు భద్రత ఏర్పాట్లు
భివండీలోని సోనాలే గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరగనున్న రాహుల్ బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాహుల్ భద్రతపై ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారి బల్వంత్ సింగ్ బృందం దృష్టి సారించింది. కాగా, ఠాణే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ బస్వరాజ్ పాటిల్, కార్యదర్శి ప్రదీప్ రాఖా, నాయకులు దయానంద్ చోర్గే, పట్టణ జిల్లా అధ్యక్షుడు సాహెబ్ గుడ్డుఖాన్, ఠాణే జిల్లా పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ పూర్ణేకర్, అగ్రిసేనా ప్రముఖుడు రాజారాం సాల్వీ, కార్యకర్తలు సభ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సభకు రాయ్‌గడ్, నాసిక్, ఠాణే తదితర ప్రాంతాల నుంచి వచ్చే రెండు వేల బస్సులకు పార్కింగ్ సౌకర్యం, దాదాపు 1.5 లక్షల మంది కార్యకర్తలకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సభకు సీఎం చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మంత్రులు రాధాకృష్ణ విఖే పాటిల్, థోరాత్, రాణే హాజరుకానున్నారు.
నేడు రాష్ట్రానికి రాహుల్
Published Tue, Mar 4 2014 10:41 PM | Last Updated on Thu, Sep 27 2018 5:25 PM
Advertisement
Advertisement