
చిగురుటాకులా వణికిన బెంగళూరు
ఎడతెరిపి లేకుండా నిన్నరాత్రి (శుక్రవారం) నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమయింది.
బెంగళూరు: ఎడతెరిపి లేకుండా నిన్నరాత్రి (శుక్రవారం) నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమయింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. జనజీవనం అస్తవ్యస్తమయింది. గత రెండు రోజులుగా శాంతించిన వరుణుడు శుక్రవారం రాత్రి మరోసారి బెంగళూరు నగరంపై విరుచుకుపడ్డాడు. తీవ్ర గాలుల ఉధృతికి ఎక్కడ చూసినా కూలిపోయిన భారీ వృక్షాలు, స్థంభించిన ట్రాఫిక్, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు దర్శనమిచ్చాయి.
నిన్న రాత్రి ఎనిమిది గంటలకు మొదలయిన వర్షం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో సంజయ్‌నగర్, మిషన్‌రోడ్, సంపంగిరామనగర్, పూర్ణిమా థియేటర్, కార్పొరేషన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో 40కి పైగా భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. పూర్ణిమా థియేటర్ ప్రాంతంలో చెట్టు విరిగి పడడంతో విద్యుత్‌తీగలు నేలకొరిగిపోయాయి. ఈ సమయంలో విద్యుత్ సరఫరా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గంటల పాటు భయాందోళనలో గడిపారు. కొద్ది సేపటి అనంతరం విద్యుత్ తీగలు విద్యుత్ స్తంభం నుంచి తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది.
మైకో లేఅవుట్, కార్పోరేషన్ సర్కిల్, కస్తూర్బా రోడ్‌లలో భారీ వృక్షాలు రోడ్లపై వెళ్తున్న కార్లపై పడడంతో కార్లు పూర్తిగా ధ్వంసమవగా కార్లలోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మడివాళ ప్రాంతంలో కాలువలు ఒప్పొంగి ప్రవహించడంతో పలు ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. గాంధీనగర్, శాంతినగర్, కబ్బన్‌పార్క్ రోడ్, కావేరీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్‌జాం అయింది. టౌన్‌హాల్, మెజిస్టిక్, కనకపుర, కరమంగళ తదితర ప్రాంతాల్లో కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో అర్ధరాత్రి వరకు వాహనదారులు వర్షంలో తడుస్తూ ఇక్కట్లు పడాల్సివచ్చింది. కేఆర్ సర్కిల్‌లోని అండర్‌పాస్ బ్రిడ్జి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో అండర్‌పాస్‌లో ప్రయాణిస్తున్న కారు నీటిలో చిక్కుకోవడంతో కారులోని వ్యక్తి కారుపైకి ఎక్కి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
దీనిపై సమాచారం అందుకున్న హలసురు పోలీసులు నీటిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించి క్రేన్ సహాయంతో కారును వెలికితీశారు. నగరంలోని చాలా చోట్ల రోడ్లపై భారీ వృక్షాలు నేలకొరగడంతో ఇతర ప్రాంతాల వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో వాహనదారులు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కన్నడ భవనంలోని నయన సభాభవనంలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వర్షపు నీరు సభాభవనంలోకి ప్రవేశించడంతో అప్పటి వరకు ప్రదర్శితమవుతున్న సరసమ్మన సమాధి నాటకాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి నీటిని బయటకు తోడారు.
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయంపై వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం రాత్రి మాత్రమే బెస్కాం అధికారులకు నాలుగు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. అందులో 2,600పైగా ఫిర్యాదులను పరిష్కరించగా మరో రెండు వేల ఫిర్యాదులో పెండింగ్‌లో ఉన్నాయి. కాగా మార్చ్ 1 నుంచి మే26 వరకు నగరంలో సరాసరి 196 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా అందులో ఒక్క మే నెలలోనే 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు.