అమ్మ ఒక వజ్రం
అమ్మ (జయలలిత) ఒక వజ్రం అని సూపర్‌స్టార్ రజనీకాంత్ కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి ఇక లేరన్న వార్త తమిళప్రజల గుండెల్ని గాయపరచింది.సినీలోకాన్ని అంతగా గుండెల్ని పిండింది. అమ్మ భౌతికకాయానికి జాతి, మతం, తన పర భేదాల్లేకుండా దేశ ప్రజలందరూ నివాళులర్పించారు. అమ్మ మళ్లీ తిరిగి రావాలని గుండెలోతుల్లోంచి ఆకాంక్షించారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో నిర్వహించిన సంతాప సభలో చిత్ర పరిశ్రమ అంతా కన్నీటి అంజలి తెలిపింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖులు అమ్మతో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఎన్నికల్లో అమ్మకు వ్యతిరేకించాను
అమ్మకు అంజలి ఘటించిన అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ 1996 శాసనసభ ఎన్నికల్లో తాను జయలలితకు వ్యతిరేకంగా నిలిచానన్నారు. ఆ విషయం తనను ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉందన్నారు. ఆ తరువాత తన కూతురు ఐశ్వర్య తన వివాహాన్ని పోయస్‌గార్డెన్‌లోనే జరుపుకోవాలని కోరుకుందన్నారు. దీంతో పొరుగునే ఉన్న జయలలితను పెళ్లికి ఆహ్వానించకుండా ఎలాగని భావించి ఆమెను కలవడానికి అనుమతి కోరగా వెంటనే అనుమతించారన్నారు.తాము పెళ్లి పత్రికను అందించి ఆహ్వానించి మీ సమక్షంలో వివాహం జరగాలని కోరామన్నారు. అదే తేదీన పార్టీ సమావేశం ఉందని.. అయినా దాన్ని వాయిదా వేయించి పెళ్లికి వస్తాననీ హామీ ఇచ్చారన్నారు. చెప్పినట్లుగానే జయలలిత ఐశ్వర్య పెళ్లికి వచ్చారనీ గుర్తు చేసుకున్నారు.
పురుషాధిక్యాన్ని ఎదురొడ్డి తన సొంత ప్రయత్నాలతోనే అమ్మ పోరాడి గెలిచారనీ పేర్కొన్నారు. ఈత,ఎదురీత జయలలిత నుంచే నేర్చుకోవాలని సూచించారు. నటిగానూ, రాజకీయంగానూ తన గురువు, ఆరాధ్యదైవం ఎంజీఆర్ కంటే సాధికురాలు జయలలిత అని పేర్కొన్నారు. తమిళనాట పురట్చితలైవిగా ఎదిగి ప్రజల గుండెల్లో అమ్మగా స్థిరస్థాయిగా నిలిపోయారన్నారు. ఇప్పుడు కోహినూర్ వజ్రంగా మెరీనా తీరంలో నిక్షిప్తమయ్యారనీ ఆయన పేర్కొన్నారు. నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్, విశాల్, కార్తీ, శివకుమార్, వడివేలు, మోహన్, కార్తీక్, రాజేశ్, ఆర్‌వీ.ఉదయకుమార్, జీవా, నటి సచ్చు, సంగీత, గీత, రాధ, అంబిక, రాజశేఖర్, జీవిత, రోహిణితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.