
సాక్షి, చెన్నై: రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ ప్రవేశంపై డీఎండీకె అధ్యక్షుడు, నటుడు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ స్పందించారు. వీరిద్దరి కంటే రాజకీయాల్లో తానే సీనియర్ అని చెప్పారు. రజనీ, కమల్ తన కంటే జూనియర్లని అని వ్యాఖ్యానించారు. వీరిద్దరితో కలిసి పోటీ చేయబోమని సూచనప్రాయంగా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎండీకె ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు.
తమిళుల దేవత ఆండాల్ అమ్మవారిపై కవి, సినీగేయ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలను విజయ్‌కాంత్ ఖండించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా జీయర్ల పోరాటానికి మద్దతు తెలిపారు. కాగా, ఒక పత్రికలో ఆండాల్ అమ్మవారి గురించి రాసిన వైరముత్తు.. ఆమెను 'దేవదాసి'తో పోల్చారు. దీంతో హిందూ సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. తన వ్యాఖ్యలకు వైరముత్తు క్షమాపణ చెప్పినప్పటికీ నిరసనలు ఆగలేదు. వైరముత్తు నాలుక కోస్తే రూ.10 కోట్లు బహుమతిగా ఇస్తానని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటించడం సంచలనం రేపింది.