దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ ఆశయాల సాధనకు అందరూ నడుం బిగించాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు,
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ ఆశయాల సాధనకు అందరూ నడుం బిగించాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు, రాజీవ్ జ్యోతి సద్భావన కమిటీ వ్యవస్థాపక చైర్మన్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాజీవ్‌జ్యోతి యాత్రను ప్రతిఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఈనెల 15వ తేదీన బెంగళూరు నుంచి ప్రారంభమైన రాజీవ్‌జ్యోతిని కర్ణాటక పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ గురువారం చెన్నైకి చేరుకుంది. ఇక్కడి రాజీవ్ స్మారక స్థూపం వద్ద టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసు, జయకుమార్, చెల్లకుమార్, మాజీ ఎంపీ వసంతకుమార్, యశోద, వి. నారాయణస్వామి, స్మారక స్థూపం ఇన్‌చార్జ్ మురుగానందం రాజీవ్‌జ్యోతికి స్వాగతం పలికారు. దేశసమైక్యత, సమగ్రత, సెక్యులిరిజంను కాపాడుతాం, శాంతిపరిరక్షణకు పాటుపడతాం, ఉగ్రవాదం, మతత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ నేతలచేత పొంగులేటి ప్రతిజ్ఞ చేయించారు.