ఆనందంలో జీవీ
అతి పిన్నవయసులోనే సంగీత దర్శకుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్న జి.వి.ప్రకాష్‌కుమార్ తాజాగా కథా నాయకుడిగా అవతారమెత్తి తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఈయన హీరోగా నటించిన చిత్రం డార్లింగ్. ఈయన సంగీత బాణీలు అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, స్టూడియో గ్రీన్ కె ఇ జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మించారు. నవదర్శకుడు శ్యామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిక్కి గర్లాణి నాయికిగా నటించారు. తెలుగు చిత్రం ప్రేమకథా చిత్రానికి రీమేక్ అయిన డార్లింగ్ అనూహ్యంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఐ, పూర్తి కమర్షియల్ కథా చిత్రం ఆంబళ చిత్రాలకు పోటీలో సంక్రాంతి బరిలోకి దూకింది.
అంతగా భారీ అంచనాలు నెలకొన్న భారీ చిత్రాల మధ్య తొలి చిత్ర హీరో జి.వి.ప్రకాష్‌కుమార్ చిత్రం విడుదలవుతోందనగానే కొందరు వారికేమైనా పిచ్చా అనుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఐ, ఆంబళ చిత్రాల మధ్య నలిగిపోకుండా డార్లింగ్ బాగుందనే టాక్‌తో ప్రజాదరణ పొందుతోంది. లవ్ హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందిన డార్లింగ్ హిట్ టాక్ తెచ్చుకుంది. జి.వి.ప్రకాష్ నటుడిగా పాస్ అయ్యారు. చాలా మెచ్యూరిటీతో నటించారు. హారర్ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు శ్యామ్ కొత్తవాడైనా చక్కని కథనంతో ఆసక్తిగా చిత్రాన్ని తెరకెక్కించారనే ప్రశంసలు అందుకుంటున్నారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు జి.వి.ప్రకాష్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి పెన్సిల్‌తో త్వరలోనే అలరించడానికి రెడీ అవుతున్నారు.