రోశయ్య కొనసాగేనా.. లేదా?
చెన్నై : రాష్ట్ర గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య కొనసాగేనా లేదా, కొత్త గవర్నర్ వచ్చేనా అన్న..? చర్చ తమిళనాడు రాష్ట్రంలో సాగుతున్నది. అయితే, రోశయ్య పదవీ కాలం ముగియడానికి రెండు రోజులు మాత్రం సమయం ఉన్న దృష్ట్యా, ఆయన్నే కొనసాగించవచ్చన్న ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న కొణిజేటి రోశయ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన సేవల్ని తమిళనాడుకు అందిస్తున్నారు.
కేంద్రంలో అధికారం మారినా, ఆయనే గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ తన పదవీ కాలాన్ని లాగించారు. కాగా ఈనెల 31వ తేదీతో రోశయ్య పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే కొత్త గవర్నర్ నియామకానికి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఇంత వరకు అలాంటి ప్రయత్నాలు జరగనట్టు సమాచారం. అదే సమయంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమించాలన్న ప్రతి పాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమాచారాలు ఉన్నాయి.
అయితే, కర్ణాటకతో కావేరి వివాదం సాగుతు న్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తమిళులు గవర్నర్‌గా స్వీకరించేనా అన్న ప్రశ్న కేంద్రాన్ని వెంటాడుతూ వచ్చినట్టు ప్రచారం సాగింది. తదుపరి శంకర మూర్తి నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆ పేరు కాస్త తెర మరుగైనట్టు అయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్‌గా రోశయ్య మళ్లీ కొనసాగుతారా..? లేదా, కొత్త వాళ్లెవరైనా నియమించబడతారా..? అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. కొత్త గవర్నర్ నియామకం సంబంధించి పాత గవర్నర్ పదవీ కాలం ముగియడానికి పది హేను రోజుల ముందుగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. అయితే, ఇంతవరకు అలాంటివి జరగలేదు. ఇక, మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న దృష్ట్యా, కొణిజేటి రోశయ్య పదవీ కాలాన్ని పొడిగించేనా అన్న చర్చ రాజ్‌భవన్ వర్గాల్లో సాగుతున్నది.
తమిళనాడు ప్రభుత్వం కూడా రోశయ్యకు సానుకూలంగా ఉన్న దృష్ట్యా, మరో ఏడాది లేదా, రెండేళ్ల పదవీ కాలం పొడిగించవచ్చన్న ప్రచారం బయలుదేరింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు వెలువడేనా, లేదా కొత్త గవర్నర్ నియామకం జరిగేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలే అవకాశాలు ఉన్నాయని సమాచారం.