పోలీసుల వలయంలో ‘చిన్నస్వామి’
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ స్థానిక చిన్నస్వామి స్టేడియంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర అడిషనల్ పోలీష్ కమిషనర్ కమల్‌పంత్ మీడియాతో మాట్లాడుతూ... చెన్నైలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఐపీఎల్ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ముగ్గురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 60 మంది ఇన్‌స్పెక్టర్లు, 110 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా 1500 మంది కానిస్టేబుళ్లు, కేఎస్‌ఆర్‌సీపీ, సీఏఆర్ ప్లటూన్లు స్టేడియం లోపల, బయట విధుల్లో ఉన్నారని తెలిపారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి గేట్ వద్ద సాయుధ బలగాలు మొహరించి ఉన్నాయన్నారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నట్లు వివరించారు. మ్యాచ్‌కు ముందు స్టేడియంలోపల స్నిప్పర్ డాగ్, బాంబ్ నిర్వీర్యదళం పరిశీలించిదని అన్నారు. బెంగళూరు సెంట్రల్ డీసీపీ రవికాంత్ గౌడ మాట్లాడుతూ స్టేడియం లోపల, బయట వందకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.