
సాజిద్ కు రాఖీ కూడా కట్టాను
దర్శకుడు సాజిద్ ఖాన్, తనకు మధ్య ‘ఏదో’ ఉందంటూ వస్తున్న పుకార్లతో తమన్నా తలపట్టుకుంది. ఇతడు నాకు అన్న వంటివాడని, తామిద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందంటూ వచ్చే పుకార్లు విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తోందని చెప్పింది. సాజిద్ దర్శకత్వం వహించిన తాజా సినిమా హమ్‌షకల్స్‌లో తమన్నా హీరోయిన్‌గా కనిపిస్తుంది. దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరైన తమన్నా, హిమ్మత్‌వాలాతో బాలీవుడ్‌కు పరిచయమయింది. సాజిద్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ‘సాజిద్ నా అన్న. అతనికి రాఖీ కూడా కట్టాను. ఇటువంటి పుకార్లు తమాషాగా అనిపిస్తాయి. దర్శకుడు నటిపై నమ్మకం ఉంచిన మాత్రాన, వాళ్లిద్దరికి సంబంధం అంటగట్టడం న్యాయం కాదు.
ఇలాంటివి ఎంతో బాధకలిగిస్తాయి’ అని తెలిపింది. హమ్‌షకల్స్ ప్రచారం కోసం నగరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ బ్యూటీ పైవిషయాలు వివరించింది. ఇందులో తమన్నా సైఫ్ అలీఖాన్‌కు జోడీగా నటిస్తోంది. రితేశ్ దేశ్‌ముఖ్, రామ్‌కపూర్, బిపాషా బసు, ఈశాగుప్తా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్నా, ఈశాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే కోపంతో సినిమా ప్రచారానికి బిపాసా దూరంగా ఉంటున్నట్టు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
దీని గురించి తమన్నా స్పందిస్తూ బిపాసా ప్రచారానికి రాకపోవడం నిజమేనని, అయితే దాని వెనుక ఉన్న కారణం మాత్రం తనకు తెలియదని చెప్పింది. ‘షూటింగ్ సందర్భంగా సెట్స్‌పై అందరం సన్నిహితంగా ఉన్నాం. ఒకరితో ఒకరం బాగా కలసిపోయాం. ఎవరికి ఎలాంటి పాత్ర ఉంటుందని, దాని నిడివి ఎంత ఉంటుంది.. ఇలాంటి విషయాలన్నింటినీ సాజిద్ ముందుగానే అందరికీ చెప్పేశాడు’ అని ఈ 24 ఏళ్ల యువతి వివరించింది. ఇక హమ్‌షకల్స్ ఈ నెల 20న థియేటర్లకు వస్తోంది.