జయను ప్రధానమంత్రిని చేద్దాం
రాష్ట్రంలోని 40 పార్లమెంట్ స్థాలను కైవసం చేసుకొని ముఖ్యమంత్రి జయలలితను ప్రధానిగా చేసేందుకు కృషి చేద్దామని తిరునల్వేలిలో జరిగిన సమత్తువ మక్కల్ కట్చి
టీనగర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని 40 పార్లమెంట్ స్థాలను కైవసం చేసుకొని ముఖ్యమంత్రి జయలలితను ప్రధానిగా చేసేందుకు కృషి చేద్దామని తిరునల్వేలిలో జరిగిన సమత్తువ మక్కల్ కట్చి మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్ పిలుపునిచ్చారు. సమత్తువ మక్కల్ కట్చి (ఎస్‌ఎంకే) రెండవ రాష్ట్ర మహానాడు ఆదివారం సాయంత్రం నెలై్లలో ప్రారంభమైంది. వేలాది మంది పాల్గొన్న ఈ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్ మాట్లాడారు. తమది కులానికి చెందిన పార్టీ కాదన్నారు. కామరాజర్ బాటలో జాతి, కుల, మతాలకు అతీతంగా ప్రజల కోసం పాటుపడటమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు.
పతిపక్ష పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు వహిస్తున్న డీఎండీకే నేత విజయకాంత్ బాధ్యతాయుతంగా నడుచుకోవడంలో విఫలమయ్యారన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న సమయంలో శ్రీలంక తమిళులను కాపాడేందుకు ప్రయత్నించకుండా ప్రస్తుతం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు డీఎంకే వ్యవహరిస్తోందన్నారు. కట్చి దీవిని కోల్పోయి ప్రస్తుతం జాలర్లు అలమటించేందుకు ఆ పార్టీయే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అన్నాడీఎంకే కూటమి 40 స్థానాలను కైవసం చేసుకుంటుందని, దీని ద్వారా జయలలిత ప్రధాని అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఆమె ప్రధాని పీఠాన్ని అధిష్టించేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని అన్నారు. ఇదే సమయంలో మహానాడులో తీర్మానాలను ప్రవేశ పెట్టారు.
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మూడవ కేంద్రాన్ని తూత్తుకుడి జిల్లా కులశేఖరన్ పట్టిలో ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు అటవీ భద్రత చట్టం అమలును నిలిపివేయాలి. రాష్ట్ర జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిషేధించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే కూటమి 40 స్థానాల్లో గెలుపొందేందుకు ఎస్‌ఎంకే పాటు పడుతుంది. నెలై్ల జిల్లాను రెండుగా విభజించి తెన్ కాశి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఎస్‌ఎంకే మహిళ విభాగం కార్యదర్శిగా రాధికను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు రాధికకు శుభాకాంక్షలు తెలిపారు. సిరాజ, సెంట్రల్ చెన్నై వెస్ట్ జిల్లా కార్యదర్శి ఎస్ ప్రసాద్, ఎబిఎస్ పొన్నరసన్ పాల్గొన్నారు.