
శరత్‌కుమార్, సీమాన్
సాక్షి, చెన్నై: తమిళనాడులో మరో రాజకీయ కూటమి ఏర్పాటైంది. సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మదురై విమానాశ్రయంలో వారు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని, రాష్ట్ర సంక్షేమం కోసం తాము కలిసి పోరాడతామని వారు తెలిపారు. అంశాలవారీగా పోరు కొనసాగిస్తామని ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమలహాసన్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన శరత్‌కుమార్, సీమాన్ చేతులు కలపడం చర్చనీయాంశంగా మారింది. రజనీ-కమల్‌కు వ్యతిరేకంగా వీరు గళం విన్పిస్తున్నారు. మరోవైపు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ కూడా రజనీ-కమల్‌తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.