
బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షాఖైదీగా ఉన్న చిన్నమ్మ శశికళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. బ్లడ్‌ప్రెషర్, షుగర్ శాతం ఎక్కువ కావడంతో జైల్లోనే ఉన్న ఆసుపత్రిలో గురువారం రాత్రి ఆమెను అడ్మిట్ చేశారు. ఆరోగ్యం కుదుట పడకుంటే బెంగళూరులోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకర్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే తుది తీర్పు వెలువడే నాటికే జయలలిత మరణించడంతో మిగిలిన ముగ్గురు బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. మధుమేహ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్లనే అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను వెంటనే జైల్లోని ఆసుపత్రిలో చేర్చారు. జైలు డాక్టర్లు ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. అలాగే బ్లడ్‌ప్రెషర్‌తో సైతం ఆమె బాధ పడుతున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. జైలులోని ఆసుపత్రిలో చేస్తున్న చికిత్స వల్ల ఆమె కోలుకోని పక్షంలో బెంగళూరు సిటీలోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితం కూడా శశికళకు మధుమేహం, రక్తపోటు ఎక్కువ కావడంతో విక్టోరియా ఆసుపత్రిలోనే చికిత్స చేశారు. కొన్నిరోజుల్లో ఆరోగ్యం కుదుటపడడంతో మరలా జైలుకు చేర్చారు. భర్త నటరాజన్ చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపుడు పెరోల్‌పై చెన్నైకి వచ్చి పరామర్శించి, వెళ్లారు. కొన్నిరోజుల్లోనే నటరాజన్ మృతిచెందగా మరలా పెరోల్‌పై వచ్చి అంత్యక్రియల్లో పాల్గొని వెళ్లారు. శశికళ మరలా అనారోగ్యానికి గురికావడంతో విక్టోరియా ఆసుపత్రికి తరలించడం, ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment