- మరోసారి బీజేపీకే దక్కిన ఎస్‌డీఎంసీ మేయర్ పదవి
- వరుసగా ఐదు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన సుభాష్
- డిప్యూటీ మేయర్‌గా కుల్దీప్ సోలంకి
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్‌డీఎంసీ) మేయర్‌గా సుభాష్ ఆర్య ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన ఫర్హాద్ సురీపై బీజేపీ తరఫున పోటీచేసిన సుభాష్ 19 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీకే చెందిన కుల్దీప్ సోలంకీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 73 సంవత్సరాల సుభాష్ ఆర్య ఎస్‌డీఎంసీ బీజేపీ కౌన్సిలర్లందరిలోకి సీనియర్. ఆయన వ రుసగా ఐదు సార్లు రాజోరీ గార్డెన్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం ఆయన ఎస్‌డీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉండగా, ఫర్హాద్ సురి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 17 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆర్య జన్‌సంఘ్ బ్లాక్ సెక్రటరీగా పనిచేశారు. 1983లో మెట్రో పాలిటన్ కౌన్సిల్ ఎన్నికలతో ఆయన పూర్తి స్థాయి ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004-05లో ఆయన దక్షిణ ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 104 మంది సభ్యులుండే ఎస్‌డీఎంసీలో ప్రస్తుతం 97 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 50 మంది బీజేపీకి చెందినవారు కాగా, 29 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇద్దరు ఐఎన్‌ఎల్‌డీ కౌన్సిలర్లు, ఒకరు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలకు చెందిన కౌన్సిలర్లు ముగ్గురేసి ఉన్నారు. వీరు కాక 12 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు.
వీరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, బీజేపీకి చెందిన నలుగురు లోక్‌సభ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆప్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం మేయర్ పదవికి, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు జరుగుతాయి. మొదటి సంవత్సరం మేయర్ పదవిని మహిళల కోసం రిజర్వ్ చేశారు. రెండవ, నాలుగవ, ఐదవ సంవత్సరాలలో దానిని జనరల్ కేటగిరీకి కేటాయిం చారు. మూడో సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవి గత కొన్నేళ్లుగా బీజేపీకే దక్కుతోంది. మిగతా రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా మేయర్ పదవిని దక్కించుకోవడం బీజేపీకి నల్లేరుపై నడకే. దక్షిణ ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది.
ఎస్‌డీఎంసీ మేయర్‌గా సుభాష్ ఆర్య
Published Fri, Apr 24 2015 11:15 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement