గూగుల్ హ్యాంగౌట్‌లో షీలా దీక్షిత్
Published Fri, Nov 29 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కంటే ఆమ్‌ఆద్మీ పార్టీ, బీజేపీ ముందంజలో ఉన్నట్టు కొన్ని ఒపీనియన్ పోల్స్ వెల్లడించడంతో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆన్‌లైన్ ప్రచారబాట పట్టారు. గూగుల్ హ్యాంగౌట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్, వీడియోచాట్ సదుపాయంతో ఆమె ఢిల్లీవాసులతో సంభాషించనున్నారు. ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల ముందు.. అంటే ఈ నెల 30న ఆమె ఆన్‌లైన్ ప్రచారం నిర్వహిస్తారు. గూగుల్ సంస్థ కన్నాట్‌ప్లేస్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి గంటసేపటి వరకు ఆమె వీడియోచాట్‌లో అందుబాటులో ఉంటారు. ఢిల్లీ ఎన్నికల కోసం పనిచేసే కొందరు ఐటీ నిపుణులు ఈ వీడియోచాట్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఇది వరకే పలుసార్లు వెబ్‌మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడడం తెలిసిందే.
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీడియోచాట్ ద్వారా సంభాషించే సదుపాయాన్ని గూగుల్ హ్యాంగౌట్ పేరుతో ఆ సంస్థ ఈ ఏడాది మే 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది.www.sheiladikshit. net/hangout.php లింకు ద్వారా ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడుతూనే ప్రశ్నలూ అడగవచ్చు. ఆమె అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలు వేసే ప్రశ్నలకు కూడా షీలా దీక్షిత్ బదులిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రశ్నలను తీరును పరిశీలించాలక వాటిని అడగాల్సిన వ్యక్తులను ఎంపిక చేస్తున్నట్టు చెప్పాయి. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై యువతకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికే ఈ ప్రయత్నమని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. తన హయాంలో మొదలైన అభివృద్ధి ప్రాజెక్టులను షీలా దీక్షిత్ ఎక్కువగా ప్రస్తావి స్తున్నారు. అంతేకాదు ట్విటర్‌లోనూ ఆమె పేరుపై ఒక పేజీ ఉంది. దీనికి 227 మంది ఫాలోవర్లు ఉన్నా ఇప్పటికీ ఒక్క ట్వీట్ కూడా పోస్టు కాలేదు.
Advertisement