ప్లాప్ వస్తే ఇటువైపు కూడా చూడరు
హిట్లు వస్తే చుట్టూ మూగేవారు ఒక ప్లాప్ వస్తే అటువైపు కూడా చూడదని నటి శృతిహాసన్ పేర్కొనడం టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. ఈ క్రేజీ బ్యూటీ స్వానుభవంతో చెబుతోందా లేదా ఇతరులకు జరిగిన ఘటనలను బట్టి అంటోందా తెలియదు గానీ అప్పుడప్పుడు వాస్తవాలు మాట్లాడుతూ ఇండస్ట్రీలోని వారికి చురకలు అంటిస్తున్నారు. శృతి కెరీర్ అపజయాల నుంచే విజయాల స్థాయికి చేరుకున్నదన్న విషయం తెలిసిందే. తమిళంలో ఇటీవల విడుదలైన పూజై చిత్రంతోనే ఆమె తొలి హిట్ కొట్టారు.
ఇక తెలుగులో పవర్, ఎవడు, రేసుగుర్రం చిత్రాలతో ప్రముఖ హీరోయిన్ల జాబితాలోకి చేరారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో నటించిన గబ్బర్ ఈస్ బేక్ ఇటీవలే తెరపైకి వ చ్చింది. ఇది తమిళంలో ఘన విజయం సాధించిన రమణ చిత్రానికి రీమేక్. దీనిపై పరిశ్రమ వర్గాల్లో మిశ్రమ స్పందన రావడం గమనార్హం. శృతి మాట్లాడుతూ చిత్రం పరాజయం పాలై తే అప్పటి వరకు చుట్టూ మూగిన వారు దూరమవుతుంటారన్నారు.
స్టార్ హీరోయిన్ స్థానం గర్వంగా ఉంటుందని తెలిపారు. అయితే ఆ స్థాయికి చేరుకోవడం అంత సులభమైన విషయం కాదన్నారు. స్టార్ హీరోల సరసన నటించి రాణించడం కూడా కష్ట సాధ్యమేనన్నారు. నటనలో తన తల్లిదండ్రులు కమలహాసన్, సారికతో పోలుస్తూ ప్రశ్నిస్తున్నారని, వారితో తనను పోల్చడం సరికాదని అన్నారు. గబ్బర్ ఈస్ బ్యాక్ చిత్రం గురించి చెప్పాలంటే ఆ చిత్ర కాన్సెప్ట్, కథాపాత్రల రూపకల్పన చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఈ క్రేజీ నటి త్వరలో మరోసారి సూర్యతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం.