సాక్షి ముంబైః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి చోటుదక్కింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి కొనసాగిన ఉత్కంఠతకు సోమవారం తెరదింపుతూ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో శివసేనకు చెందిన ఒకే ఎంపీ ఉండగా బీజేపీ సభ్యులు ఐదుగురు ఉన్నారు. కేబినేట్ హోదా దక్కించుకున్నవారిలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే ఉన్నారు. మరోవైపు స్వతంత్రహోదాలో మంత్రి పదవి దక్కించుకున్న వారిలో బీజేపీ ఎంపీలు ప్రకాష్ జావ్డేకర్, పీయుష్ గోయల్ ఉన్నారు. శివసేన సీనియర్ నాయకుడు అనంత్ గీతేకు కేబినేట్ హాదా కల్పించారు. జాల్నా బీజేపీ ఎంపీ రావుసాహెచ్ దాన్వే కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు ముంబైలో సోమవారం భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు.
ఎవరికి ఏ శాఖలు...?
రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలకు మంత్రులుగా అవకాశం వచ్చినా, ఎవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారనే విషయంపై సస్పెన్స్ వీడలేదు. సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లేదంటే గ్రామీణాభివృద్ధిశాఖ ఇచ్చేఅవకాశం ఉంది. ముండేకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలే అధికమని బీజేపీ నాయకులు అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించేందుకుగా ముండేకు వ్యవసాయశాఖ మంత్రి పదవిని కట్టబెడతామన్నారు.
ఈ విషయంపై ముండే మాత్రం ఏమీ చెప్పడంలేదు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అంటున్నారు. ఇది ఉండగా మరోవైపు బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లేదా రైల్వేశాఖ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మౌలిక సదుపాయాల రంగంపై ఆయనకు ఆసక్తి అధికమని చెబుతారు. గతంలోనూ ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పీయుష్ గోయల్, ప్రకాష్ జావ్డేకర్‌కు ఏయే శాఖలు దక్కుతానేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు శివసేన నాయకుడు ఆనంత్ గీతేకు కూడా ఏ శాఖను కేటాయించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
మిత్రపక్షాల్లో అసంతృప్తి...?
పదవుల కేటాయింపుపై బీజేపీ మిత్రపక్షాలు శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కొంత అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. శివసేన కనీసం ఒక కేబినేట్, రెండు సహాయమంత్రి పదవులు లభిస్తాయని ఆశలు పెట్టుకుంది. ఈ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషికి లోక్‌సభ స్పీకర్ పదవి దక్కుతోందని వార్తలు వచ్చాయి. అయితే చివరికి రాయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఎంపీ ఆనంత్ గీతేకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఆయనకు కేబినేట్ హోదా ఇవ్వడంతో పార్టీకి కొంత ఊరట దక్కింది. మరోవైపు రామ్‌దాస్ ఆఠవలే, రాజు శెట్టి కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో రామ్‌దాస్ ఆఠవలే ప్రమాణ స్వీకార వేడుకలకు కూడా వెళ్లలేదని తెలిసింది. మలివిడత మంత్రి మండలి విస్తరణలో తమకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకం శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కనిపిస్తోంది.
మనకు 6 బెర్తులు
Published Mon, May 26 2014 10:28 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement