ముంబై: వాయువ్య ముంబైలో పాత భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారి సమస్యలను పరిష్కరిస్తానని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హామీని ఇచ్చారు. వీరు ఉంటున్న పాత భవనాలను ఖాళీ చేసి పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంభ్యతర పత్రం (నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్) తప్పనిసరి సమర్పించాలన్న రక్షణ శాఖ నిబంధనాలను సడలించేందుకు ప్రయత్నిస్తానని గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు.
ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నిరంభ్యతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) పొం దేందుకు కఠిన నిబంధనలు అమలుచేస్తుండటంతో ఈ ప్రాంతంలో పునరాభివృద్ధి ప్రతిపాదనలు అటకెక్కిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ‘సంబంధిత అధికారులతో సోమవారం సమావేశమవుతా. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం తర్వాత మంత్రిత్వ మార్గదర్శకాలు కఠినం చేయడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను రక్షణ మంత్రి ఏకే ఆంటోని దృష్టికి తీసుకెళతా’నని అన్నారు.
కందివలి, మలాడ్ ప్రాంతాల్లో ఉన్న సెంట్రల్ అర్డనన్స్ డిపోకు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని రకాల నిర్మాణ ప్రాజెక్టులకు ఎన్‌వోసీని రక్షణ మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేయడంతో స్థానికులు గతకొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తర ముంబై కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరూపమ్ వివరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దీనిపై అనుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు ముందు ప్రజ లకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో ఉన్నా. అధికార సభ్యునిగా ఉన్నప్పటికీ సామాన్యులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వంపైనే పోరాడేందుకు కూడా వెనుకాడన’ని నిరూపమ్ పేర్కొన్నారు.
కొత్త కట్టడాలకు మాత్రమే ఎన్‌వోసీ కావాలనే నిబంధన ఉండేదని, అయితే ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం తర్వాత రక్షణ దళాల పరిధిలోని భూముల సమీపం లో చేపట్టే కొత్త కట్టడాలు, పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లకు కూడా ఎన్‌వోసీ తప్పనిసరని అనే నిబంధనను చేర్చిందని వివరించారు. 1970లో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీటిని పునరాభివృద్ధి చేయాల్సి ఉందని, అయితే ఎన్‌వోసీ తప్పనిసరి అనే నిబంధనతో ఇప్పటికీ వారు అందులోనే బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారని తెలిపారు. దీన్ని ప్రాథమ్యంగా తీసుకొని రక్షణ శాఖ నిబంధనాల్లో సడలించాలని కోరారు.
పునరాభివృద్ధికి సహకరిస్తా
Published Sun, Feb 9 2014 11:42 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement