విచారణ చేయాలని ఆప్ ఫిర్యాదు
బెంగళూరు: మ్యాట్రిక్స్ సంస్థ ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు పొందడంపై సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రపై లోకాయుక్తలో ఫిర్యాదు నమోైదె ంది. వివరాలు... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించి మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేశారని, సీఎం కుమారుడు యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్నందువల్లే ఆ కంపెనీకి అనుమతులను కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుమతుల మంజూరు విషయంలో డాక్టర్ యతీంద్ర పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు సోమవారమిక్కడ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆప్ రాష్ట్ర శాఖ ప్రతినిధి శివకుమార్ చెంగల్‌రాయ మాట్లాడుతూ... కేవలం స్వజనపక్షపాతంతోనే ఈ టెండర్లను మ్యాట్రిక్స్‌కు కట్టబెట్టినట్లు ఇప్పటికే తేటతెల్లమైందని విమర్శించారు. డాక్టర్ యతీంద్ర తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని ఈ టెండర్‌ను దక్కించుకున్నారని ఆరోపించారు. అందువల్ల ఈ విషయంపై నిష్పక్షపాత విచారణను జరిపించాలని లోకాయుక్తను కోరినట్లు చెప్పారు. లోకాయుక్తలో నిష్పక్షపాత విచారణ జరగకపోతే తాము న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇక ఇదే సందర్భంలో తన కుమారుడి కోసం నిబంధనలను పక్కకు పెట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని శివకుమార్ డిమాండ్ చేశారు.