
ఒకే వేదికపై ఆ ఇద్దరు..
ఐల్యాండ్ గ్రౌండ్ వేదికగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్నికల్లో భాగంగా ప్రసంగించనున్నారు. మే ఐదో తేదీన సాయంత్రం జరిగే బహిరంగ సభకు లక్షల మందిని సమీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లును డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు గురువారం పరిశీలించారు.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీఎంకే కేటాయించిన 41 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఆయా అభ్యర్థులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. వీరికి మద్దతుగా డీఎంకే తరఫున కరుణానిధి,దళపతి స్టాలిన్, ఎంపీ కనిమొళి ప్రచారం చేస్తున్నారు. గురువారం కరుణానిధి తిరుచ్చిలో పర్యటించి ఓటర్లను తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. అలాగే, మరో మూడు వారాల్లో అన్నాడీఎంకేను సాగనంపేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక, దళపతి స్టాలిన్ చెన్నైలో సుడిగాలి పర్యటన చేశారు. అన్నాడీఎంకేకు అన్ని స్థానాల్లోనూ పతనం ఖాయం అని జోస్యం చెప్పారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార పయనానికి ఏఐసీసీ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆ మేరకు మే ఐదో తేదీన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ చెన్నై, పుదుచ్చేరిల్లో పర్యటించనున్నారు. తదుపరి రాహుల్ గాంధీ రాష్ర్టంలో పర్యటించనున్నారు. సోనియా పర్యటన తేధీ ఖరారు కావడంతో అందుకు తగ్గ ఏర్పాట్లపై కాంగ్రెస్, డీఎంకే వర్గాలు దృష్టి పెట్టాయి.
ఒకే వేదికపై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఒకే వేదికపై కొన్నేళ్ల తర్వాత ప్రత్యక్షం కాబోతున్నారు. ఇందుకు వేదికగా చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. ఐదో తేదీ సాయంత్రం ఇక్కడ భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ అభ్యర్థులు, డీఎంకే అభ్యర్థుల పరిచయంతో సోనియా గాంధీ, కరుణానిధిల ప్రసంగం సాగబోతున్నది. లక్ష మందిని సమీకరించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నాయి. ఉదయం ఐల్యాండ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లకు సంబంధించి డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అభ్యర్థి శేఖర్ బాబు, కాంగ్రెస్ అభ్యర్థులు రాయపురం మనో, కరాటే త్యాగరాజన్ పరిశీలన జరిపారు. అదే రోజు సోనియా గాంధీ పుదుచ్చేరిలోనూ పర్యటించనున్నారు. 30 స్థానాల్ని కల్గి ఉన్న పుదుచ్చేరిలో కాగ్రెస్ 20, డీఎంకే పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ఇరు పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఉదయం ప్రచార బహిరంగ సభ జరగనున్నది. ఇందులో సోనియాగాంధీ పాల్గొననున్నారు. అయితే, కరుణానిధి పాల్గొంటారా... అన్నది ఖారారు కావాల్సి ఉంది. వయోభారంతో ఉన్న కరుణానిధి పుదుచ్చేరి నుంచి ఆగమేఘాలపై మళ్లీ చెన్నైకు రావాలంటే సమస్యలు తప్పవు. అందుకే పుదుచ్చేరి సభకు ఆయన దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువే.