
దానికి అభ్యంతరం లేదు
అతిథి పాత్రకు అభ్యంతరం లేదు, ఆంక్షలు లేవు అంటోంది నటి సోనియా. ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న నూతన చిత్రంలో అతిథి పాత్రలో మెరవనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి సోనియా చాలా ఆసక్తికరమైన అతిథి పాత్రను పోషిస్తోందట. ఈ తెలుగమ్మాయి తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అంతేకాదు తెలుగు, కన్నడ భాషల్లోను నటిగా గుర్తింపు పొందింది. తమిళంలో ఇంతకుముందు ఇనిదు ఇనిదు, పైయ్యా చిత్రంలో నటించింది. విజయ్ సేతుపతితో నటిస్తున్న చిత్రం తనకు మూడో తమిళ చిత్రం అంటున్న సోనియూ మాట్లాడుతూ, ఇక్కడి అవకాశాలను ఎంజాయ్ చేస్తున్నానంటోంది.
తమిళ చిత్రాల్లో నటించడం విభిన్న అనుభవంగా పేర్కొంది. ఇతర భాషా చిత్రాలతోను సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తెలుగులో హ్యాపీడేస్, వినాయకుడు లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందినట్లు చెప్పింది. కన్నడంలోను అక్కడి సూపర్‌స్టార్ పునిత్ రాజ్‌కుమార్ సరసన నటించినట్లు తెలిపింది. ఆ తరువాత కూడా కన్నడంలో పలు అవకాశాలు వచ్చాయని అయితే మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. మలయాళ చిత్రాలు చర్చల్లో వున్నట్లు చెప్పింది. భాష ఏదైనా అతిథి పాత్ర అయినా అంగీకరించి నటించేస్తున్నట్లు తెలిపింది. అలాంటి పాత్రలకు అభ్యంతరాలు, ఆంక్షలు ఉండవని చెప్పింది. ఇలా నటిస్తూపోతే ముందు ముందు వారే నటనకు అవకాశం వున్న పాత్రల్లో నటించే అవకాశాలు కల్పిస్తారనే ధీమాను సోనియా వ్యక్తం చేస్తోంది.