దూసుకొస్తున్న బుల్లెట్ | special story on bullet train Mumbai-Ahmedabad | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న బుల్లెట్

Published Sun, Aug 21 2016 2:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

దూసుకొస్తున్న బుల్లెట్

దూసుకొస్తున్న బుల్లెట్

ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏర్పాటుకు నిర్ణయం
2018 నుంచి మొదలుకానున్న పనులు
2024కల్లా ట్రాక్ పైకి
8 గంటల ప్రయాణం ఇక 2 గంటల్లో

ప్యాసింజర్..  ఎక్స్‌ప్రెస్..  సూపర్‌ఫాస్ట్..
వీటి మధ్య ఉన్న ప్రధాన తేడా వాటి వేగమే. అదే వాటి పేర్లను మార్చేసింది. ఈ వేగానికి కారణం టెక్నాలజీ. దీనికి ఆ రంగం.. ఈ రంగం అంటూ ఏ తేడా ఉండదు. ఇది ఏ రంగంలోనైనా వినూత్నమైన మార్పులకు నాంది పలుకుతుంది. అలాంటిదే ఇప్పుడు మన రైల్వే రంగంలోనూ జరగబోతోంది. ఒకప్పుడు కొంత దూరానికి కూడా పొగ రైళ్లలో రోజుల తరబడి ప్రయాణించేవాళ్లం. ఇప్పుడు కొన్ని గంటల్లోనే సుదూర గమ్యాలను చేరుకునే అవకాశం అందుబాటులో ఉంది. అదే ‘బుల్లెట్’ ట్రైన్. దీనిని మొదటగా ఆర్థిక రాజధాని అయిన ముంబై, ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే 508 కిలోమీటర్ల
దూరాన్ని కేవలం 2-3 గంటల్లోనే చేరుకోవచ్చు.

బుల్లెట్ రైలు ఏర్పాటు ఆలోచన యూపీఏ ప్రభుత్వం నుంచి ఉంది. దీనిని తొలిగా 2009-10 ైరె ల్వే బడ్జెట్‌లో ప్రస్తావించారు.. అప్పటి యూపీఏ ప్రభుత్వం పుణే రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ వరకు ముంబై మీదుగా దాదాపు 650 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు అనుకున్నారు. ప్రాజెక్టు అధ్యయనానికి సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య 2013లో ఒక ఎంవోయూ కూడా కుదిరింది. తర్వాత కాలానుగుణంగా కొన్ని మార్పులు జరిగాయి. చివరికి 2015 డిసెంబర్‌లో భారత్, జపాన్ మధ్య ముంబై- అహ్మదాబాద్ కారిడార్‌కు సంబంధించిన ఒప్పందం జరిగింది.

 ప్రాజెక్టు విశేషాలు ఇవి..!
ఈ బుల్లెట్ రైలు దేశ పారిశ్రామిక రాజధాని అయిన ముంబై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్  అహ్మదాబాద్ మధ్య సేవలందించనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇది 11 స్టేషన్లను కలుపుతూ వెళ్తుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు సాధారణ రైళ్లలో వెళ్లాలంటే దాదాపు 8 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సుమారు 2 నుంచి 3 గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవచ్చు.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.97,636 కోట్లు. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జైకా) 81 శాతం నిధులు అంటే రూ.76,165 కోట్లను రుణంగా అందించనుంది. రుణంలో వ్యయ పరిమితి, వడ్డీ, దిగుమతి సుంకాలన్నీ కలగలిపి ఉన్నాయి. 15 ఏళ్ల మారటోరియంతో 50 ఏళ్ల పాటు 0.1 శాతం వార్షిక వడ్డీ చెల్లించేలా రుణ ఒప్పందం జరిగింది. భారత రైల్వే రూ.9,800 కోట్లను అందించనుండగా.. మిగతా మొత్తాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌లు భరిస్తాయి. ట్రాక్ నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.140 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చవుతుందని జైకా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానుండగా.. పనులు 2018లో ప్రారంభమవుతాయి. 2024 నాటికి బుల్లెట్ ట్రాక్ మీదకి దూసుకొచ్చే అవకాశం ఉంది.

 బ్రేక్ వేయాల్సిందిక్కడే..
ముంబై-అహ్మదాబాద్ మధ్య రైలు 11 చోట్ల ఆగనుంది. ముం బై, థానే, విరార్, దహను, వల్సద్, వపి, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్/నడియాద్, అహ్మదాబాద్ స్టేషన్లు ప్రతిపాదనలో ఉన్నాయి.

 చార్జీలిలా..!
సాధారణ రైళ్ల ఫస్ట్‌క్లాస్ ఏసీ టికెట్ ధరతో పోలిస్తే బుల్లెట్ రైలు టికెట్ ధర దాదాపు 1.5 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏసీ మొదటి తరగతి టికెట్ ధర రూ.2,200 ఉంటే.. అదే బుల్లెట్ రైలులో అయితే దాదాపు రూ.3,300గా ఉంటుంది. కాగా, ఈ రైలులో 10 నుంచి 16 కోచ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తద్వారా 1,300 నుంచి 1,600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రైలులో వైఫై వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

 జపాన్‌దే తొలి బుల్లెట్.. చైనాదే వేగం
ప్రపంచంలో మొట్టమొదటి హైస్పీడ్ రైల్వే వ్యవస్థను 1964లో జపాన్ నిర్మించింది. ఆ తర్వాత 1981లో ఫ్రాన్స్, 1989లో ఇటలీ, 1991లో జర్మనీ, 1992లో స్పెయిన్, 1997లో బెల్జియం దేశాలు నిర్మించగా.. 2007లో చైనాలో అందుబాటులోకి వచ్చింది. కాగా, చైనాకు చెందిన షాంఘై మాగ్లేవ్ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలుగా రికార్డులకెక్కింది. దీని గరిష్ట వేగం గంటకు 430కి.మీ కాగా, సగటు వేగం గంటకు 251 కి.మీ. దీనిని 2004 ఏప్రిల్‌లో ప్రారంభించారు. అలాగే చైనాకే చెందిన హార్మొనీ సీఆర్‌హెచ్ 380ఏ ఈ రైలును 2010 అక్టోబర్‌లో ప్రారంభించారు. దీని గరిష్ట వేగం 380 కి.మీ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రెండో రైలు. ఇదీ బీజింగ్-షాంఘై మధ్య సేవలందిస్తోంది. కాగా, జపాన్‌కు చెందిన జపనీస్ మాగ్లేవ్ రైలు(గంటకు 603 కి.మీ) పట్టాలెక్కితే ఇదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డులకెక్కనుంది.

 అవసరమా?
దాదాపు రూ.లక్ష కోట్లు వెచ్చించి రెండు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇదివరకే  దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తే మంచి ఫలితా లు పొందొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో నడుస్తోన్న పలు రైళ్లను వాటి శక్తిసామర్థ్యాల మేర వినియోగించుకోలేకపోతున్నామని గుర్తు చేస్తున్నారు. ధనవంతులు, వ్యాపారవేత్తలను దృష్టిలో ఉంచుకొని కాకుండా సామాన్యులను పరిగణనలోకి తీసుకొని సంస్కరణలు జరగాలంటున్నారు. సంపన్నులు విమానాల్లో కూడా ప్రయాణించగలరని, వారి కోసం ఎయిర్ కనెక్టివిటీ సౌలభ్యాన్ని మెరుగుపరిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. అలాగే దీని స్థాపనకు జపాన్ (50 ఏళ్లకు) రుణమిస్తోంది. ఇంత సుదీర్ఘకాలానికి అప్పుచేసి పప్పు కూడు తినడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. - గుండ్ర వెంకటేశ్  - సాక్షి, సెంట్రల్ డెస్క్

 సముద్రంలోనూ బుల్లెట్..
అరేబియా సముద్రం కింద ఈ రైలు బుల్లెట్‌లా దూసుకుపోనుంది. దాదాపు రైలు మార్గమంతా భూ ఉపరితలంపైనే ఉంటుంది. అయితే థానే నుంచి విరార్ వరకు సుమారు 21 కిలోమీటర్ల  మేర  మాత్రం సముద్రగర్భంలో ప్రయాణించొచ్చు. ఇందుకోసం ఓ భారీ టన్నెల్‌ను నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement