సాక్షి, చెన్నై: కడలిలో రాష్ట్ర జాలర్లకు భద్రత కరువైన విషయం తెలి సిందే. తరచూ శ్రీలంక నావికాదళం ప్రదర్శిస్తున్న పైశాచికత్వంతో జాలర్ల కుటుంబాలు తీవ్ర మనోవేదన చెందుతున్నాయి. దాడులు, బందీలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా, కడలిలో పూర్తి స్థాయి భద్రత ధ్యేయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో చేపల వేట సాగేలా శ్రీలంక - భారతదేశం మధ్య ఒప్పందాలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇరు దేశాల జాలర్ల మధ్య చర్చలకు ఏర్పాట్లు చేశారు. తొలి విడత చర్చ చెన్నై వేదికగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగింది. చర్చలు రెండు దేశాల మధ్య సామరస్య పూర్వకంగా సాగాయి. కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సంతృప్తికరంగా చర్చలు సాగినా ఇందులో చేసిన తీర్మానాల్ని గోప్యంగా ఉంచారు. మలివిడత చర్చల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మలి విడత చర్చలకు ముహూర్తాలు అచ్చి రాలేదు. మూడుసార్లు చర్చల తేదీ వాయిదా పడింది. ఓ మారు విమానం ఎక్కే సమయంలో చర్చలు వాయిదా పడడంతో ఇంక చర్చలు సాగేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఎట్టకేలకు ముహూర్తం కుదరడంతో జాలర్ల సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
26 మందితో బృందం
రాష్ట్రంలోని నాగపట్నం, రామేశ్వరం, తూత్తుకుడి, పుదుకోట్టై జాలర్ల సంఘాల ప్రతినిధులతో పాటుగా పుదుచ్చేరి, కారైక్కాల్ సంఘాల ప్రతినిధులు 17 మందితో బృందాన్ని రాష్ట్ర మత్స్య శాఖ ఎంపిక చేసింది. వీరంతా ఇది వరకు తొలి విడత చర్చల్లో పాల్గొన్న వారే. అలాగే మరో తొమ్మిది మంది అధికారుల్ని ఎంపిక చేశారు. 26 మంది ప్రతినిధులతో కూడిన ఈ బృందం ఎట్టకేలకు శ్రీలంకకు పయనమైంది. ఈ మేరకు శనివారం రాత్రి చెన్నైలోని మత్స్య శాఖ డెరైక్టరేట్‌లో ఆ విభాగం డెరైక్టర్ మునియాండి నేతృత్వంలో సుదీర్ఘ చర్చ సాగింది. ఇందులో తొలివిడతలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల చుట్టూ చర్చ సాగినట్టు, వీటి అమలు లక్ష్యంగా మరిన్ని చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఆదివారం ఉదయం కూడా మరో మారు సమావేశమైంది. రాత్రి చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు పయనమైంది.
నేడు చర్చలు
కొలంబో వేదికగా సోమవారం చర్చలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ చర్చల్లో తొలి విడత చర్చల్లో తీసుకున్న నిర్ణయాల అమలు లక్ష్యంగా శ్రీలంక ప్రతినిధులపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఇప్పటికే పలు అంశాలపై ఆదేశ సర్కారు ఆమోదాన్ని జాలర్ల సంఘాల ప్రతినిధులు పొందారు. కొన్ని అంశాల్ని ఆ దేశ సర్కారు పక్కన పెట్టినట్టు వస్తున్న సంకేతాలతో మలి విడత చర్చ సత్ఫలితాల్ని ఇచ్చేనా అన్న ఉత్కంఠ నెలకొంది. మలి విడత చర్చే తుది విడత కావాలన్న తలంపుతో రాష్ట్ర ప్రతినిధుల బృందం కొలంబోకు వెళ్లింది. ఈ విషయంగా తమిళ జాలర్ల సంఘాల ప్రతినిధి ఇలంగో మీడియాతో మాట్లాడుతూ సామరస్య పూర్వక వాతావరణంలో చర్చలు ఫలితాన్ని ఇస్తాయన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. తొలి విడత చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ఆ దేశ ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయాన్ని శ్రీలంక జాలర్లు ప్రకటించాల్సి ఉందన్నారు.
లంక కు పయనం
Published Sun, May 11 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement
Advertisement