= త్వరలో కోర్ కమిటీ సమావేశం : జోషి
= రాష్ర్టంలో నాలుగైదు చోట్ల మోడీ బహిరంగ సభలు
= జనవరి లేదా ఫిబ్రవరిలో సభలు నిర్వహించే అవకాశం
= యడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై విభేదాల్లేవు
= ఆయన షరతులపై అధిష్టానం స్పందిస్తుంది
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై త్వరలోనే పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందు సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. గతంలో లోక్‌సభ ఎన్నికల్లో తొలుత 15, తర్వాత 19 స్థానాలను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ సారి మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నాలుగు చోట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలను నిర్వహించాలని యోచిస్తునామని వెల్లడించారు. ఆయన కేటాయించే సమయాన్ని బట్టి జనవరి లేదా ఫిబ్రవరిలో సభలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా యడ్యూరప్పను బీజేపీలోకి తిరిగి తీసుకు రావడంపై పార్టీ నాయకుల్లో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. యడ్యూరప్ప ప్రజా నాయకుడని, కాంగ్రెసేతర ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతో ఆయనను చేర్చుకునే విషయమై అధిష్టానంతో చర్చించామని తెలిపారు. సీనియర్ నాయకులందరూ సానుకూలంగానే స్పందించారని చెప్పారు. యడ్యూరప్ప ప్రస్తావించిన షరతుల గురించి అడినప్పుడు, దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం కావాలి
అంతకు ముందు దక్షిణాది బీజేపీ యువ మోర్చా శాఖల పదాధికారుల సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామనే తృప్తితో ఉండవద్దని, లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలని ఉద్బోధించారు. యువకులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో రాష్ట్ర శాఖలోనూ ఉత్సాహం ఉరకలేస్తోందని అన్నారు.
అయితే ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న ఆరేళ్ల కాలంలో ధరల పెరుగుదలపై పార్లమెంట్ ఒక రోజు కూడా చర్చ జరగలేదని, యూపీఏ హయాంలో ప్రతి సమావేశంలోనూ చర్చ జరుగుతోందని ఆయన దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు అనురాగ్ సింగ్ ఠాకూర్, ఐదు దక్షిణ రాష్ట్రాల యువ మోర్చా శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.
వేట ప్రారంభం
Published Tue, Dec 10 2013 3:23 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement