మాటలే.. చేతలు లేవు
మాటలు గుప్పించారు, చేతలు మాత్రం శూన్యం అంటూ నటి శ్వేతాబసు వాపోతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఇప్పుడిప్పుడే కథా నాయకిగా ఎదుగుతున్న ఈమె ఆర్థిక సమస్యలు, లేక ఇతర కారణాలు గాని ఆ మధ్య వ్యభిచారం వ్యవహారంలో పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బాలీవుడ్ దర్శకులతో సహా పలువురు శ్వేతాబసుకు మద్దతు ప్రకటించి, నటిగా అవకాశాలు కల్పిస్తామని బహిరంగంగానే వె ల్లడించారు. అయితే అలాంటి వారిలో ఏ ఒక్కరూ అవకాశం కల్పించలేదని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఒక చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తెలుగు నటుడు విష్ణు మంచు మినహా ఇతరులెవరూ అవకాశం ఇవ్వలేదన్నారు. విష్ణు చిత్రంలో నటించే విషయం కూడా చర్చల్లో ఉందని తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ ఏ భాషలోనైనా తాను నటించడానికి సిద్ధమని అన్నారు. అలాగే తనకు వ్యక్తిగత కార్యనిర్వాహకుడంటూ ఎవరూ లేరని అవకాశం కల్పించేవారు నేరుగా తనను సంప్రదించవచ్చని శ్వేత పేర్కొంది.