
పొంగల్ స్పెషల్
పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ర్ట రవాణా శాఖ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి ఆరువేల స్పెషల్ బస్సులు చెన్నై
పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ర్ట రవాణా శాఖ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి ఆరువేల స్పెషల్ బస్సులు చెన్నై నుంచి వివిధ జిల్లాలకు, పట్టణ, నగరాలకు పరుగులు తీయనున్నాయి. కోయంబేడులో టికెట్ రిజర్వేషన్‌కు 25 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ మేరకు సీఎం జయలలిత ఆదేశాలతో రాష్ట్ర రవాణా శాఖ బుధవారం వివరాలను వెల్లడించింది.
సాక్షి, చెన్నై:భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటిని కలిపి పెద్దపండుగగా పిలుస్తారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు ఇంటిల్లి పాది స్వగ్రామాలకు బయలుదేరుతారు. ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో స్థిర పడిన వాళ్లంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ సొంత గూటికి చేరుకుని కలసికట్టుగా పండుగను జరుపుకుంటారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రైల్వే యంత్రాంగం చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల వైపుగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ నేతృత్వంలో ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధం అయింది.
ప్రత్యేక బస్సులు: చెన్నై కోయంబేడు బస్ టెర్మినల్ నుంచి సాధారణంగా నడిచే బస్సులతోపాటుగా సంక్రాంతి స్పెషల్‌గా 6,514 బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. చెన్నై నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు, నగరాలు, పట్టణాలకు ఈ బస్సులు నడపనున్నారు. అలాగే,ఆయా జిల్లా కేంద్రాలు, నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు, చెన్నైకు అదనపు బస్సులు పయనించనున్నాయి. సంక్రాంతికి మరో వారం సమయం ఉన్నా, శుక్రవారం నుంచి బస్సుల్ని నడిపేందుకు సిద్ధం అయ్యారు. శని, ఆదివారాలు సెలవులు కలసి వస్తుండటంతో స్వగ్రామాలకు జనం పయనం అవుతున్నారు. చెన్నై నుంచి శుక్రవారం - 600, శనివారం 1,325, ఆదివారం 1,175, సోమవారం 339, మంగళవారం ప్రయాణికుల సంఖ్యను బట్టి సాధారణంగా తిరిగే బస్సుల్ని నడుపుతారు. ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకు, ఇతర ప్రాంతాలకు శుక్రవారం 345, శనివారం 375, ఆదివారం 760, సోమవారం 1220 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. పండుగను ముగించుకుని తిరుగు పయనమయ్యే వారి కోసం 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇదే సంఖ్యలో బస్సులు రోడ్డెక్కనున్నాయి.
300కిలోమీటర్లకు పైగా పయనించేవారు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కోయంబేడు బస్టాండ్ ఆవరణలో 25 కౌంటర్లతో పాటుగా ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.www.tnstc.in ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. చెన్నైలో: చెన్నై మహానగరంలోనూ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచి నగర వాసులు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలకు వెళతారు. కనుమ, ముక్కనుమ రోజుల్లో పర్యాటక కేంద్రాలు జన సందోహంతో నిండిపోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోయంబేడు, ప్యారీస్, టీ నగర్, తాంబరం తదితర ప్రధాన బస్టాండ్ల నుంచి కోవళం, మహాబలిపురం, ముట్టుకాడు, పళ్లికర నై, వీజీపీ, కిష్కిందా, క్వీన్స్ లాండ్, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లు తదితర పర్యాటక కేంద్రాల మీదుగా 150 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు.