ఆరనిజ్వాల
కాంగ్రెస్, , తమిళ సంఘాల మధ్య రగిలిన జ్వాల రెండో రోజూ ఆరలేదు. బుధవారం జరిగిన రణరంగానికి ప్రతిఫలంగా గురువారం చెన్నైలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. నామ్ తమిళర్ కట్చి కార్యాలయంపై పెట్రో బాంబు దాడి జరిగింది. కాంగ్రెస్ వర్గాల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సత్యమూర్తి భవన్ ముట్టడి, దాడి కేసులో ఏడుగురు తమిళ సంఘాల ప్రతినిధులను అరెస్టు చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నామ్ తమిళర్ కట్చి, తమిళర్ మున్నేట్ర పడై తదితర ఈలం తమిళాభిమాన సంఘాలు ఇచ్చిన పిలుపు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బుధవారం సత్యమూర్తి భవన్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. దీంతో ఆ పరిసరాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహాలపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ తమ ప్రతాపం చూపించారు. ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.
రాజీవ్ విగ్రహాల ధ్వంసం: వేప్పెరి పోలీసు స్టేషన్ సమీపంలో, పెరంబూరు బ్యారెక్స్ రోడ్డు - పురసై వాక్కం మార్గంలో, పటాలంలోని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఒక చోట విగ్రహం ముఖాన్ని ధ్వంసం చేయగా, రెండు చోట్ల తలను తీసి పక్కన పెట్టేశారు. మరి కొన్ని చోట్ల విగ్రహాలను అవమానించే రీతిలో వ్యవహరించి వదిలి పెట్టారు. ఉదయాన్నే ఈ విగ్రహాలను చూసిన ఆయా ప్రాంతాల కాంగ్రెస్ నేతల్లో ఆక్రోశం రగిలింది. ఈ ధ్వంసం తమిళ సంఘాల పనేనంటూ ఆందోళనలకు దిగారు. రాయపురం, పెరంబూరు, పురసైబాక్కం, వలసరవాక్కంలలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. ఈ దాడులు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ అండ్ బృందం పనిగా పేర్కొంటూ, వారిని అరెస్టు చేయాలని పట్టుబట్టారు. రాస్తారోకోలతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనకుండా ఆయా పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్తగా కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామని కాంగ్రెస్ నేత రాయపురం మనో పేర్కొన్నారు.
పెట్రో బాంబు దాడి: బుధవారం అర్ధరాత్రి నామ్ తమిళర్ కట్చి కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు పోరూర్‌లోని ఆ పార్టీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు. అదృష్ట వశాత్తు ఆ పెట్రోల్ బాంబు పేలలేదు. అక్కడి సిబ్బంది దానిని ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ బాంబు దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు. విగ్రహాల ధ్వంసాలపై కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి కార్యాలయానికి భద్రతను కల్పించారు. ఉదయాన్నే కొందరు కాంగ్రెస్ నాయకులు వలసరవాక్కంలోని సీమాన్ ఇంటిపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఏడుగురు అరెస్టు:సత్యమూర్తి భవన్‌వద్ద జరిగిన దాడిపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. ఆ కార్యాలయంపై దాడికి, కాంగ్రెస్ నాయకులపై హత్యాయత్నం చేశారంటూ ఏడుగుర్ని అరెస్టు చేశారు. వీరిలో తమిళర్ మున్నేట్ర పడైకు చెందిన వీర లక్ష్మి, దురై, పార్తీబన్, సురేష్, మదన్, వెంకటేష్, భరత్ ఉన్నారు.