డీఎండీకే, ప్రజాకూటమి నాయకులు ఒకే వేదిక మీద దర్శనం ఇవ్వనున్నారు. పొత్తు పదిలం , సీట్ల పందేరం కొలిక్కిరావడంతో అభ్యర్థుల జాబితా ప్రకటనకు నిర్ణయించింది. ఈ నెల పదో తేదీన చెన్నై శివారులోని మామండూరులో భారీ మహానాడు రూపంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేపట్టారు. ఇక ఈ కూటమికి ఆమ్ ఆద్మీ ఝలక్ ఇచ్చింది. ఎవ్వరికీ మద్దతుగానీ, అనుకూలంగాగానీ వ్యవహరించ కూడదని ఆ పార్టీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే వీరితో పొత్తుపై టీఎంసీ నేత జీకే వాసన్ ఎటూతేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు.
సాక్షి, చెన్నై: డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి తమ బలాన్ని మరింతగా పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ)నేత జీకేవాసన్, తమిళనాడులోని ఆమ్ ఆద్మీ పార్టీని తమతో కలసి అడుగులు వేయించేందుకు కుస్తీలు తీవ్రంగానే పట్టింది. అయితే, జీకే వాసన్ ఎన్నికల్ని ఎవరితో ఎదుర్కొంటారో అన్నది ఆ పార్టీ వర్గాలకే అంతు చిక్కడం లేదు. డీఎండీకే అధినేత విజయకాంత్ వంటి నాయకుడే పొత్తు వ్యవహారాన్ని తేల్చినా, వాసన్ మాత్రం ఎవరికీ చిక్కడం లేదు.
అన్నాడీఎంకే ఇంటర్వ్యూల పర్వం శుక్రవారంతో ముగిసింది. సీట్ల పందేరాల పర్వాన్ని ముగించి ఆ పార్టీ 234 స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దించే కసరత్తుల్లో మునిగింది. ఇక, డిఎంకే తమ గొడుగు నీడన వాసన్‌కు చోటు లేదన్నది తేల్చేసింది. మిగిలిందల్లా డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి మాత్రమే. వాళ్లు కూడా ఇక, వాసన్‌ను పక్కన పెట్టే దిశగా కసరత్తుల్లో పడ్డారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే వ్యవహారాలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఆమ్ ఆద్మీ తమకు మద్దతుగా వ్యవహరిస్తుందని గురువారం ఆశాభావం వ్యక్తం చేసిన ప్రజా సంక్షేమ కూటమికి మిగిలింది నిరాశే.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమిళనాట ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని, ఎవరికీ అనుకూలంగా వ్యవహరించకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆమ్ ఆద్మీ తమకు హ్యాండ్ ఇవ్వడంతో ఇక, తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి సిద్ధమయ్యాయి. ఇందుకు ఈనెల పదో తేదీన చెన్నై శివారులోని మామండూరు వేదికగా భారీ మహానాడుకు నిర్ణయించారు.
ఒకే వేదిక మీదకు: ఇన్నాళ్లు ఎన్నికల ప్రచారంలో ప్రజా సంక్షేమ కూటమిలోని వైగో, తిరుమా, రామకృష్ణన్, ముత్తరసన్ ఒకే వేదిక మీద దర్శనం ఇస్తున్నారు. అయితే, విజయకాంత్ మాత్రం ఇంత వరకు వేదిక ఎక్కలేదు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నదని చెప్పవచ్చు. అదే సమయంలో విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ కూటమికి మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ కూటమి నాయకులు వైగో, తిరుమావళవన్, ముత్తరసన్, రామకృష్ణన్ మధ్యాహ్నం విజయకాంత్‌తో భేటీ అయ్యారు.
సీట్ల పందేరం కొలిక్కి రావడం, నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ ముగియడంతో ఇక, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన ముగించి ఈనెల పదో తేదిన ప్రకటించేద్దామన్న నిర్ణయానికి నేతలు వచ్చారు. మామండూరు వేదికగా జరిగే మహానాడులో విజయకాంత్‌ను కూటమి సీఎం అభ్యర్థిగా అధికార పూర్వకంగా పరిచయం చేయడానికి నిర్ణయించారు. అలాగే, ఆయా పార్టీలకు చెందిన కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన, అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఇదే వేదిక మీద నిర్వహించేందుకు నిర్ణయించారు.
తదుపరి మీడియాతో వైగో మాట్లాడుతూ, ఇక, ఎన్నికల ప్రచార ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. మామండూరు వేదికగా మహానాడు రూపంలో బహిరంగ సభకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఇక, ఐదో తేదీ అన్నదాతలు చేపట్టనున్న ఆందోళనల్లో ప్రజా కూటమి వర్గాలు పాల్గొంటాయని, వారికి మద్దతుగా తమ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతారని ప్రకటించారు.
సమాలోచన
Published Sat, Apr 2 2016 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement
Advertisement