సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ని కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన నలుగురిని హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మోహన్, కవిదరన్, శంకర్, కుమార్ ఉన్నారు. వీరిలో మోహన్, కవిదరన్ టైలర్లుగా పనిచేస్తున్నారు. వీరందరూ గార్మెంట్స్ దుకాణం నిర్వహించి నష్టపోయారు. దీంతో చేసిన అప్పులు తీర్చేందుకు హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని కిడ్నాప్ చేయాలని భావించారు.
రెండురోజుల క్రితం ఎలక్ట్రానిక్‌సిటీ నుంచి కారులో ఇంటికి బయలుదేరిన టెక్కీని బైక్‌ల్లో అనుసరించి, నిర్జన ప్రదేశంలో బైక్‌ను కారుకు తాకించి అతనితో గొడవపడ్డారు. అనంతరం అతన్ని కిడ్నాప్ చేసి అతడి భార్యకు ఫోన్ చేయించి తొలుత రూ. 5 లక్షలు.. అనంతరం రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఘటనపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేపట్టిన డీసీపీ రోహిణి కటౌచ్ సెపట్ రంగంలో 8 బృందాలను దింపారు. పక్కా సమాచారంతో తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో తల దాచుకున్న కిడ్నాపర్లను అరెస్ట్ చేసి, టెక్కీని కాపాడారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.