ఉల్లి ధరలే ప్రధానాంశం
Published Sun, Aug 25 2013 10:46 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: శాసనసభ సమావేశాలు ఈ నెల 27వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి. నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముండడంతో ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఈ సమావేశాల్లో ఒకదానిని ఒకటి ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఉల్లి ధరల పెరుగుదలే ప్రధానాంశంగా ప్రభుత్వంపై దాడికి దిగడానికి బీజేపీ సన్నద్ధమవుతుండగా, అనేక ప్రజాకర్షక ప్రతిపాదనలతో కాంగ్రెస్ తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నించనుంది. దీంతోపాటు ధరల పెరుగుదల, విద్యుత్తు, నీటి చార్జీల పెంపు తదితర అంశాలను కూడా బీజేపీ లేవనెత్తనుంది. ఓటర్ల ఎదుట తమ బలాన్ని చాటుకునేందుకుగాను విమర్శనాస్త్రాలను సంధించుకునేందుకు సిద్ధమైన అధికార, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదర్చడం కోసం స్పీకర్ యోగానందశాస్త్రి కాంగ్రెస్, బీజేపీ సభా పక్షాలను సమావేశపరచనున్నారు. సోమవారం జరిగే సమావేశంలో విధానసభ సమావేశాల ఎజెండాను నిర్ణయించనున్నారు.
ఈ సమావేశాలు కేవలం రెండురోజులపాటు జరగనున్నాయి. అందువల్ల ఉల్లి ధరల పెరుగుదల, విద్యుత్తు , నీటి చార్జీల పెంపు తదితర అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ మల్హోత్రా డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనధికార కాలనీలను క్రమబద్ధీకరించినప్పటికీ అక్కడ మౌలి క సదుపాయాలు కరువయ్యాయని, ప్రభుత్వం ఇస్తున్న ఉత్తుత్తి హామీలను ఈ సమావేశాల్లో ఎండగడతామని అన్నారు. ప్రతిపక్షంతో ఏ అంశంపైనైనా చర్చ జరిపేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ శాసనసభా పక్ష ప్రతినిధి ముఖేష్ శర్మ తెలిపారు.
అయితే ప్రతిపక్షం కూడా సకారాత్మక వైఖరితో వ్యవహరించాలని ఆయన కోరారు. అనధికార కాలనీల్లో నివసించే 25 లక్షలమందికి యాజమాన్య హక్కులు కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెడుతుందన్నారు. నగరంలో 73 లక్షల మం దికి ఆహార ధాన్యాలను అందించడం కోసం ప్రవేశపెట్టిన ఆహార భద్రతా పథకానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తక్కువ ధరకు ఉల్లిపాయలను ప్రభుత్వం అందించేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను కూడా తాము సభ దృష్టికి తీసుకొస్తామని ఆయన చెప్పారు. కాగా విద్యుత్తు, నీటి చార్జీల పెంపుపై ప్రతిపక్షం చేసే దాడిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం తగు వ్యూహాన్ని రూపొం దిస్తోంది.
Advertisement
Advertisement