చిన్నమ్మలుపు
♦ శశికళ పిటిషన్‌పై ప్రతిష్టంభన
♦ కొత్త న్యాయమూర్తి నియామకం తరువాతనే విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని పేర్కొంటూ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, సుధాకరన్‌లపై అవినీతి నిరోధకశాఖ 1996లో కేసు పెట్టింది. ఈ కేసు అనేక దశల తరువాత బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు చేరగా, ఈ నలుగురికి న్యాయమూర్తి నాలుగేళ్ల జైలుశిక్ష, అలాగే జయలలితకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురికి తలా రూ.10 కోట్ల జరిమానా విధించారు. ఈ తీర్పు ప్రకారం కొద్దిరోజులు జైలుశిక్షను అనుభవించిన జయలలిత ఆ తరువాత బెయిల్‌పై బైటకు వచ్చి కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేశారు.
నలుగురు నిర్దోషులంటూ హైకోర్టు తీర్పుచెప్పడంతో విముక్తులయ్యారు. అయితే ఈ తీర్పును కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ వేరువేరుగా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తులు పినాకీ చంద్రఘోష్, అమిత్వరాయ్‌ల ముందుకు ఆనాడు విచారణకు వచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష, జరిమానాగా బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. జయలలిత కన్నుమూయడంతో ఆమెకు విధించిన శిక్షను రద్దు చేయగా, శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, సదరు తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ ఈ ముగ్గురు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఆస్తుల కేసులో ప్రధాన నిందితురాలు జయలలిత మృతి, నిర్దోషులుగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని అప్పీలు పిటిషన్‌లో కోరారు.
ఈ అప్పీలు పిటిషన్ బుధవారం కోర్టు ముందుకు రాగా, న్యాయమూర్తులు రోగిందన్ పాలినారిమన్, అమిత్తవరాయ్ విచారించాల్సి ఉంది. అయితే ఈ పునఃపరిశీలన పిటిషన్‌ను విచారించడం సబబు కాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన న్యాయ సలహాదారు ముకుల్ రోహిత్‌కీ న్యాయమూర్తి రోగిందన్ పాలినారిమన్‌ను మంగళవారం రాత్రి కలిసినట్లు సమాచారం. రోగిందన్ తండ్రి పాలిమన్ నారిమన్ గతంలో జయలలిత ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరిస్తూ అనుకూలంగా వాదించి ఉన్నందున ఈ పిటిషన్‌పై విచారణ జరపడం భావ్యం కాదని రోహిత్‌కీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, సుప్రీం కోర్టులో బుధవారం విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో శశికళ పిటిషన్ చోటు చేసుకోలేదు. అంతేగాక న్యాయమూర్తి రోగిందన్ పాలినారిమన్ విచారణ నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. రోహిత్‌కీ అభ్యర్థన మేరకే న్యాయమూర్తి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కొత్త న్యాయమూర్తి నియామకం తరువాతనే శశికళ పిటిషన్‌పై విచారణ జరగనుంది.