సాక్షి, బెంగళూరు : అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ సంస్థలు ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచేస్తూ ప్రజల తోలు తీస్తున్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొన్న బీఎంటీసీ, నిన్న కేఎస్‌ఆర్టీసీ బస్ చార్జీలు పెంచేసి ప్రజలపై పెను భారాన్నే మోపాయి. ఇంకా ఈ పెంపు భారం నుంచి నగర వాసులు తేరుకోక ముందే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఉన్న టోల్‌గేట్ చార్జీలను కూడా రాత్రికి రాత్రే పెంచేశారు. దేవనహళ్లి ప్రాంతంలో ఉన్న టోల్‌గేట్‌ను నవయుగ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం రాత్రికి రాత్రే ఆ సంస్థ టోల్‌గేట్ చార్జీలను సుమారు మూడు రెట్లు పెంచేసింది.
దీంతో అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్యాక్సీలు నడిపే డ్రైవర్లు శనివారం రాత్రి నుంచే టోల్‌గేట్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ మార్గంలో సంచరించే ట్యాక్సీలు టోల్‌గా రూ.30 చెల్లిస్తుండగా ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచడంతో ఒకసారి టోల్ ఫీజ్‌గా దాదాపు రూ.115 వరకు చెల్లించాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు.
ప్రభుత్వానికి ‘ధరల పెంపు’ రోగం ...
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ‘ధరల పెంపు’ అనే రోగం పట్టుకుందని కన్నడ చళువలి వాటాల్ పార్టీ వ్యవస్థాపకుడు వాటాల్ నాగరాజ్ విమర్శించారు. బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారమిక్కడి మైసూరు బ్యాంక్ సర్కిల్‌లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంటెద్దు బండిపై ప్రయాణిస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు.
రవాణా సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిరోధించి తద్వారా రవాణా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం అలా కాకుండా ప్రజలపై భారాన్ని మోపుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను మరింత పెంచేలా బస్సు చార్జీలను కూడా పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
‘టో(తో)ల్’ తీస్తున్నారు
Published Mon, May 5 2014 2:24 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
Advertisement