యడ్డీ.. చెప్పుడు మాటలు వినొద్దు
భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప చెప్పుడు మాటలు వినడం మానుకోవాలని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోమణ్ణ అభిప్రాయపడ్డారు.
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప చెప్పుడు మాటలు వినడం మానుకోవాలని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోమణ్ణ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కావాలంటే యడ్యూరప్ప అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒకరిద్దరు మాటలు విని నిర్ణయం తీసుకుంటే పార్టీలో అసంతృప్తి పెరగడం ఖాయమన్నారు. ‘ కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ లాంటి వారు కూడా నేను ఎదురుపడితే పలకరిస్తారు. అయితే యడ్యూరప్ప, ఆయన చుట్టూ ఉన్న కొంతమంది నన్ను కూడా పట్టించుకోవడం లేదు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి మీరే( మీడియా ప్రతినిధులు) అర్థం చేసుకోండి’ అని సోమణ్ణ వాపోయారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. పార్టీ ప్రయోజనాల రీత్యా యడ్యూరప్ప, కే.ఎస్ ఈశ్వరప్పలు ఒకే చోట చేరి ముఖాముఖి చర్చలు జరిపి తమ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ అభిప్రాయపడ్డారు.