సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని ఫైనాన్స్ కంపెనీకి చెందిన మహిళపై శుక్రవారం రాత్రి లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్యాక్సీ డ్రైవరు శివకుమార్ యాదవ్‌కు ఉబర్ కంపెనీ ఇచ్చిన ఐఫోన్‌ను మంగళవారం ఢిల్లీ పోలీసులు మధురకు వెళ్లి స్వాధీన పరచుకున్నారు. ఇదివరకే యాదవ్ వాడిన మరో రెండు ఫోన్లను స్వాధీనపరచుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఐఫోన్ దొరకడం దర్యాప్తులో కీలకమని అంటున్నారు.
కీలక సాక్ష్యం లభ్యం
ఉబర్ కంపెనీ తన క్యాబ్ డ్రైవర్లకు ఐ ఫోన్లు ఇచ్చింది. యాప్ ద్వారా కస్టమర్లు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత కంపెనీ కస్టమర్లకు దగ్గరలో ఉన్న క్యాబ్ డ్రైవరుకు సందేశం పంపుతుంది. డ్రైవరు కంపెనీ అప్పగించిన పని స్వీకరించిన తరువాత డ్రైవరు పేరు, ఫొటో, కారు రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలను కంపెనీ తన యాప్ ద్వారా కస్టమరుకు పంపుతుంది. అందువల్ల మధురలో స్వాధీనపరచుకున్న ఐఫోన్ కీలక సాక్ష్యంగా పనికివస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ ఐఫోన్‌తో శివకుమార్ యాదవ్ బాధితురాలు బక్ చేసుకున్న కారు నడిపాడన్న విషయంతో పాటు అతను ఉబర్ కంపెనీకి పనిచేస్తున్నాడన్న విషయాన్ని ధ్రువీకరించగలుగుతామని, క్యాబ్ సర్వీస్ కంపెనీకి ఈ ఘటనలో పాత్ర ఉన్నదా లేదా అనే విషయాన్ని రుజువుచేసుకోవడాని ఉపయోగపడుతోందని అంటున్నారు. ఫోన్ జీపీఎస్ రూటు ద్వారా డ్రైవరు ఎక్కడి నుంచి బాధితురాలిని పికప్ చేసుకున్నాడు, ఘటనా స్థలానికి ఏ రూటు ద్వారా ప్రయాణించాడు, ఆమెను ఎప్పుడు ఇంటి వద్ద దించాడనే విషయాన్ని తెలుసుకోవచ్చని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా ఉబర్ కంపెనీ అధికారులతో ఢిల్లీ పోలీసుల విచారణ బుధవారం కూడా కొనసాగిందని తెలిపారు.
విచారణలో పశ్చాత్తాపమే లేదు
గుర్గావ్ కంపెనీలో పనిచేస్తున్న 25 ఏళ్ల ఫైనాన్స్ అనాల్సిస్ట్‌పై లైంగిక దాడికి పాల్పడిన శివకుమార్ యాదవ్‌ను మధురలో అదుపులోకి తీసుకొన్న పోలీసులకు మరింత సమాచారం లభించింది. నిందితుడిపై మరో ముగ్గురిపై లైంగికదాడుల కేసున్నాయి. ఇందులో రెండు ఢిల్లీలో, ఒకటి యూపీలోని మణిపురి జిల్లాలో. ఇక్కడే మరో మూడు క్రిమినల్ కేసులున్నాయని విచారణలో వెల్లడైందని పోలీసులు బుధవారం పేర్కొన్నారు. ‘వరుస నిందితుడు’ శివకుమార్ తప్పులు చేసినప్పటికీ ఏ మాత్రం పశ్చాత్తాపం పడడం లేదని పోలీసులు తెలిపారు. పనిచేసే మహిళలు అంటేనే నిందితుడికి చిన్నచూపు ఉన్నట్లు తెలిసిందని తెలిపారు.
అపరిచిత మహిళల్ని టార్గెట్ ఎంచుకొని లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అయితే ఇప్పటి వరకూ నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఫైనాన్స్ కంపెనీకి చెందిన మహిళ కూడా కేసు నమదు చేయిస్తుందని నిందితుడు భావించలేదని, అందుకే నిందితుడు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతూ బెయిల్‌పై బయట తిరుగుతున్నాడని అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బ్రిజేందర్ సింగ్ తెలిపారు. ‘ నిందితుడిపై మూడు లైంగికదాడుల కేసులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా కేసుల్లో బెయిల్ పొందినట్లు చెప్పారు. 2011లో బార్ డ్యాన్సర్‌పై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి విముక్తి లభించిందని చెప్పారు.
ట్యాక్సీ డ్రైవర్ ఐఫోన్ స్వాధీనం
Published Thu, Dec 11 2014 12:51 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement