జల్లికట్టు తరహా పోరాటం రావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత సీ రామచంద్రయ్య చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత సీ రామచంద్రయ్య చెప్పారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణి ఏమాత్రం సరిగా లేదని ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమిళనాడులో ప్రజలు జల్లికట్టు కోసం పోరాడి కేంద్రం మెడలు వంచారని, అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పొద్దున చెప్పిన విషయాలను సాయంత్రానికి మరిచిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం వేరుపడి రెండున్నరేళ్లు దాటిపోయినా ప్రత్యేక హోదాపై అతీగతీ లేదని విమర్శించారు. పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి హోదా కోసం పోరాడాలని కోరారు. జన సేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారని, ఇప్పుడు అందరూ ఒక్క వేదికపైకి రావలసిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఎవరు ముందుండి నడిపినా తాము అందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని రామచంద్రయ్య చెప్పారు. ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో టీడీపీ, బీజేపీలు దోబూచులాడుతున్నాయని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధన కోసం ఆ పార్టీలు ఇప్పటికైనా కలిసొస్తే మంచిదని, రాకపోయినా ఆ పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు.