రాజకీయాల్లోకి వస్తా
తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు కథానాయకుడు అవతారమెత్తిన సీనియర్ హాస్యనటుడు వడివేలు. ఇంతకుముందు అన్నాడీఎంకే పార్టీ తరపున ప్రచారం చేసి తన సినీ కెరీర్‌లో చిక్కులను ఎదుర్కొన్న వడివేలు కొంత గ్యాప్ తరువాత తెనాలిరామన్ అనే చారిత్రక కథా చిత్రంలో నటించారు. ఆ చిత్రం పలు విమర్శలు మధ్య విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. కాగా తాజాగా ఎలి అనే చిత్రంలో నటిస్తున్నారు. తెనాలిరామన్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు యువరాజునే ఈ చిత్రానికి దర్శకుడు. నటి సదా నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని జి.సతీష్‌కుమార్, ఎస్.అరమనాథ్ నిర్మిస్తున్నారు.
చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వడివేలు మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు తిట్టేస్తున్నారన్నారు. వరుసగా చిత్రాలు చేయడం లేదన్నదే వారి కోపానికి కారణం అన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక చిత్రం చేసేస్తే బాగుండదన్నారు. అలా కొంచెం గ్యాప్ తీసుకుని ఈ ఎలి చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. హీరోయిన్‌గా సదా నటిస్తున్న ఆమెతో డ్యూయెట్లు పాడలేదన్నారు. అయితే ఆమె ఒక సైడ్ లవ్ చేస్తూ ఊహల్లో తేలుతూ తనతో ఒక హిందీ పాటలో నటించేస్తారని చెప్పారు.
చిత్రంలో తాను ఎలి (ఎలుక) ప్రతీప్ రావత్ పూణై (పిల్లి)గా నటిస్తున్నట్లు తెలిపారు. ఎలుక ఏమేమి చేస్తుందో తానీ చిత్రంలో అవన్నీ చేస్తానని చెప్పారు. ఇది పిరియాడ్ చిత్రం కాకున్నా 1960 నుంచి 70 వరకు జరిగే కథా చిత్రం అన్నారు. ఇప్పుడు పులి, సింహం పేర్లతో చిత్రాలు చేస్తున్నామని అయితే వాటిని తన చిత్రం పోటీ కాదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా వినోదభరితంగా ఉంటుందన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఏమైనా జరగవచ్చు నని తాను రాజకీయాల్లో కొచ్చే అవకాశం లేకపోలేదని వడివేలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలి చిత్ర యాప్‌ను ఆవిష్కరించారు.