నన్ను కాదు..జయలలితను అడుగు
వర్ష బాధిత మహిళపై విజయకాంత్ ఆగ్రహం
నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించిన కెప్టెన్
తిరువళ్లూరు : ఇళ్లలో చొరబడిన నీటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరిం చిన మహిళపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ చిందులు వేయడం చర్చనీయాంశమైంది. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్, తన్నీర్‌కుళం, ఎన్‌జీవో కాల నీలోనీ వరద బాధితులను పరామర్శించి, పార్టీ తరపున సహాయకాలు అందజేశారు. తిరునిండ్రవూర్‌కు వచ్చిన విజయకాంత్ నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరునిండ్రవూర్‌లో కార్యక్రమాన్ని ముగించుకుని తన్నీర్‌కుళంలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తన్నీర్‌కుళంలో కన్నమ్మ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఐదు రోజుల నుంచి వర్షపు నీరు తగ్గకపోవడంతో జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్పందించడం లేదని తెలి పింది. మీరైనా తమ ప్రాంతంలో నీటిని తొలగించండి అంటూ విన్నవించుకున్నారు. ఇందుకు స్పందించిన విజయకాంత్ తన జిల్లా కార్యదర్శి ద్వారా నీటిని తొలగిస్తానని హామీ ఇచ్చారు. ఇంతలో అక్కడే ఉన్న మరో మహిళ తమ ప్రాంతాన్ని కెప్టెన్ పరిశీలించలేదని గట్టిగా కేకలు వేశారు. తమ ప్రాంతంలో పర్యటించడం సాధ్యం కానప్పులు ఎందుకు వచ్చారని నిలదీశారు.
మహిళ మాటలు విన్న ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘ఇదిగో నన్ను కాదు అడగాల్సింది.. చెన్నై వెళ్లి జయలలితను అడుగు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. అనంతరం తనను కలిసిన చిన్నారికి విజయరాజ్ అనే నామకరణం చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి నాయుడు ఉన్నారు.