సాక్షి, చెన్నై : నెల్లై రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి మహిళా పోలీసులు పురుడు పోశారు. దీంతో ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తూత్తుకుడి జిల్లా తిరువైకుంఠం తెప్పకులం వీధికి చెందిన సుడలై భార్య మారియమ్మాల్ (28) నిండు గర్భిణి. ఆమె గురువారం తన రెండు సంవత్సరాల చిన్నారి కొప్పురందేవిని వెంటబెట్టుకుని కడయంలోని తన పుట్టింటికి రైల్లో బయలుదేరింది. కడయంకు వెళ్లుటకు శుక్రవారం సాయంత్రం నెల్లై రైల్వేస్టేషనల్లో ఆమె రైలు ఎక్కి కూర్చున్నారు. ఆ సమయంలో ఆమెకు హఠాత్తుగా ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో రైల్లో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఆమెను భద్రంగా ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చారు.
ఆమె వెంట రెండు సంవత్సరాల చిన్నారి వుండటంతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ సంగతి తెలుసుకుని అక్కడికి వచ్చిన ఎస్‌ఐ జూలియట్, మహిళా పోలీసులు రాధ, విజయలక్ష్మి మారియమ్మాళ్‌ను ప్లాట్‌ఫారంపై సురక్షిత ప్రదేశానికి తీసుకొచ్చి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కాని అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడం, ప్రసవ నొప్పులు ఎక్కువ కావడం, మారియమ్మాల్ నొప్పితో బాధపడుతుండటంతో మహిళా పోలీసులే ఆమెకు పురుడు పోశారు. దీంతో మారియమ్మాల్ ముచ్చటైన ఆడశిశువుకు జన్మనిచ్చింది. తర్వాత తల్లి, బిడ్డను 108 అంబులెన్స్‌లో నెల్లై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్బంగా చొరవ చూపిన మహిళా పోలీసులపై ఉన్నతాధికారులు, ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment