సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన 1.45 లక్షల ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ఈ భూములను పరిశ్రమల శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పారిశ్రామిక విధానాన్ని ఈ నెల 12న లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూముల ముందస్తు అప్పగింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశ విదేశాల్లోనే మేటైన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసినట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇది అత్యంత సులభమైన విధానం కావటంతో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని.. కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహి కులు తరలివస్తారనే భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే భూములు.. మౌలిక వసతుల కల్పనపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్ మినహా రాష్ట్రం లోని 9 జిల్లాల పరిధిలో పరిశ్రమల శాఖకు 1.45 లక్షల ఎకరాల భూములను ముందస్తుగా అప్పగిస్తూ ఇటీవలే రెవెన్యూ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ భూములను మూడు కేటగిరీలుగా విభజించింది. 47,912.62 ఎకరాలు చదును భూములు, 45,503.99 ఎకరాల్లో చిన్న చిన్న గుట్టలు, మట్టి దిబ్బలున్న భూములు, 52,266.38 ఎకరాలు గుట్టలు, కొండలున్న భూములుగా వర్గీకరించింది. గతంలో ఉన్న జీవో నం.571 లోని విధివిధానాలు, మార్గదర్శకాల ప్రకారం తుది అప్పగింత ప్రక్రియను తదుపరి నిర్వహించుకోవాలని సూచించింది. పరిశ్రమల శాఖకు భూములను అప్పగించటంతో పాటు.. ఆక్రమణలకు గురవకుండా ఈ భూములను పరిరక్షించే చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా సర్క్యులర్ జారీ చేశారు.
భూముల అప్పగింతతో పాటు కొత్త పారిశ్రామిక విధానానికి అనుగుణంగా సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సింగిల్ విండో విధానం, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల ప్రాసెసింగ్, 10-12 రోజుల్లో అనుమతుల జారీ, సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్ ఏర్పాటు, సింగిల్ విండో విధానం, ఆన్‌లైన్ దరఖాస్తులు స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అన్ని విభాగాల అనుమతుల ప్యాకేజీని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
పరిశ్రమలకు 1.45 లక్షల ఎకరాలు
Published Mon, Jun 8 2015 4:59 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement