సాక్షి, హైదరాబాద్: కలెక్టర్ల సదస్సు తొలిరోజున శుక్రవారం రాష్ర్ట ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పనులకు, తక్షణావసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లా కలెక్టరు వద్ద రూ. 10 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మొత్తం రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక విభాగం వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. సదస్సులో సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
- ఆసరా పెన్షన్లు అర్హులందరికీ అందిస్తూ, అనర్హులను తొలగించాలి. బోగస్ కార్డులను తీసేయాలి. పట్టణాలకు తరలించిన గ్రామీణ బ్యాంకులను మళ్లీ గ్రామాల్లోనే నెలకొల్పాలి.
- పట్టణ, గ్రామీణ అంశాల సమగ్ర సమీక్షకు నెలలో ఒక రోజు అర్బన్ డే, మరోరోజు రూరల్ డే పాటించాలి. పట్టణాల్లోని ప్రభుత్వ భూములను ప్రజావసరాలకే వాడాలి. ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో ప్రత్యేక తహశీల్దార్‌ను నియమించాలి.
- పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంటు ఇవ్వాలి. ప్రతి ఇంటిలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనకు స్వస్తి పలకాలి. కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలి. వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.12 వేలు, సామూహిక మరుగుదొడ్లకు రూ.65 వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తుంది.
- రాష్ర్టంలో ప్రస్తుతం 41.6 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, కూరగాయల మార్కెట్లు, మాంసాహార, చేపల మార్కెట్లు నిర్మించాలి.
- రైతు బజార్లు, పార్కులను ఏర్పాటు చేయాలి. పట్టణాల్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వం తరఫున తడి, పొడి చెత్తను సేకరించడానికి డస్ట్ బిన్స్‌ను కొనివ్వాలి. ఇళ్ల నుంచే చెత్తను సేకరించాలి. కామన్ డంప్ యార్డ్సు సంఖ్యను పెంచాలి. మురికి కాల్వల నిర్వహణ, వీధిలైట్ల నిర్వహణ సరిగా ఉండాలి. ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాల్లో వేర్వేరు చోట్ల డంప్ యార్డును ఏర్పాటు చేయాలి.
- అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను వెంటనే పంపాలి. 33% పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాలి.
- హరితహారం వారోత్సవాన్ని జూలై రెండో వారం లో ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహించాలి. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టాలి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతోపాటు రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలి. వాటి కోసం బోర్లు వేయాలి. హరిత హారానికి ఎమ్మెల్యేలు రూ.10 లక్షల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధిని కేటాయించాలి.
- హైదరాబాద్‌ను 400 జోన్లుగా విభజించి మొక్కలు నాటాలి. గవర్నర్, సీఎంతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కో జోన్‌లో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షిస్తారు. జిల్లాల్లోనూ అదే పద్ధతి పాటించాలి. అటవీ శాఖ భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలి.
- గుడుంబా, కల్తీ కల్లు నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. గుడుంబా వాడకానికి దారి తీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేయాలి. అరికట్టే చర్యలకు రెవెన్యూ, ఎక్సైజ్ విభాగాలు ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపించాలి.
- విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు టాయిలెట్లు నిర్మించాలి. మహిళలను వేధిస్తున్న ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
- అంగన్‌వాడీ కేంద్రాలు గ్రామం మధ్యలో ఉంచాలి. ప్రభుత్వం వంట పాత్రలు కొనివ్వాలి.
- హైదరాబాద్‌లో పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. నూతన పారిశ్రామిక విధానం రూపొం దించాలి. జిల్లాల్లో పరిశ్రమలకు అనువుగా ఉన్న భూములను గుర్తించి.. ప్రభుత్వానికి వెంటనే వివరాలు పంపాలి.
సదస్సు సైడ్ లైట్స్
గుడుంబాపై గంటసేపు చర్చ
కలెక్టర్ల సదస్సులో గుడుంబాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. నిజామాబాద్ ఎస్పీ మాట్లాడుతూ, గుడుంబాతోనే కాకుండా కల్తీ కల్లుతో ప్రాణాలు పోతున్నాయన్నారు. ‘‘ఇటీవల కొందరు కల్తీకల్లు బానిసలను స్టేషన్లకు తీసుకొస్తే సాయంత్రం ఐదవగానే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. వాళ్లను నియంత్రించేందుకు మేమే కల్లు తెప్పించి పోయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుడుంబా తయారీదారులపై దాడులు చేస్తుంటే, తమ బతుకుదెరువు మాటేమిటంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. తమ జిల్లాలో కల్తీ కల్లుతో చాలామంది చనిపోతున్నారని మంత్రి పోచారం కూడా చెప్పారు. దాంతో, గుడుంబా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వమే చౌక ధరకు మద్యం విక్రయించాలా అంటూ దాదాపు గంట సేపు గుడుంబాపైనే చర్చ జరిగింది.
ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు
కలెక్టర్ల సదస్సులో తెలుగు మాటలు సరదా పుట్టిం చాయి. సదస్సు ప్రారంభంలో పలువురు కార్యదర్శులు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని అంతా తెలుగులోనే మాట్లాడాలన్నారు. దాంతో వచ్చీ రాని తెలుగులో మాట్లాడేందుకు పలువురు ఉన్నతాధికారులు నానా తంటాలు పడ్డారు. దాంతో సదస్సులో పలుమార్లు నవ్వులు విరిశాయి. మరోసారి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి మీనా ‘ప్లీజ్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు..’ అని ఇతర అధికారులనుద్దేశించి అన్నారు. మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని, తెలుగులో మాట్లాడమని కూడా ఇంగ్లిష్‌లోనే చెప్పాలా అనడంతో అంతా నవ్వుకున్నారు.